"ఏంట్రా !! భోగి ఇంకా పది రోజులు. తెలుస్తోందా" అన్నాడు రామ కృష్ణ ఎండు గడ్డి పుల్లల్లో నించి పొగ పీలుస్తూ. "థర్డ్ లైన్ వాళ్ళు ఆల్రెడీ గా చాలా పోగేసారు" ఉప్పుందించాడు హరి గాడు. "ఏదో ఒకటి చెయ్యాలి రా !! లేకపోతె ఇంకా వేస్ట్ మనం" కొంచం విరక్తి గా అన్నాడు సాయి. "మరి నువ్వు ఏమంటావు సతీష్ గా, ఏమి మాట్లాడక పొతే ఎలా రా", రెట్టించాడు ఈ సారి.
"చూద్దాం లేరా, ఇంకా టైం ఉంది కదా" అంటూ తొందర గా ఈ టాపిక్ అయిపోతే బావుండు అని లేవ పోయాను నేను. "నీ అబ్బ !! నీకు పరిస్తితి అర్ధం కావడం లేదురా. లాస్ట్ భోగి మంటల్లో వాళ్ళే గెలిచారు. మన మంట కన్నా కనీసం ఒక గంట ఎక్కువ సేపు మండింది వాళ్ళది. నీకు సెకండ్ లైన్ పరువు ఏమి అయిన అర్ధం అవుతోందా" అని కొంచం గట్టి గానే అన్నాడు సాయి.
"మరి వాళ్ళ దగ్గర కాలనీ IOW (Inspector of Works) కొడుకు జయ గాడు ఉన్నాడు. వాళ్ళ నాన్న మరి వాళ్ళ ఆఫీసు నించి చాలా వరకు విరిగి పోయిన గేట్స్, కాలనీ లో పోగు అయిన చెక్క అంతా వాళ్ళకే ఇస్తాడు. పెద్ద మంట అయ్యింది అంటే అవ్వదా " అంటూ ధర్మ సూక్ష్మం వివరించాడు హరి.
"క్రితం సంవత్సరం ట్రాక్ పక్కన తుమ్మలతో చాలానే పోగేసాం కదరా. లాస్ట్ లో సతీష్ గాడు ఇప్పిస్తా అన్న స్లీపెర్ కట్టె వచ్చుంటే మన దే సూపర్ అయ్యేది. సుడి లేదురా మనకి" అన్నాడు నిర్లిప్తంగా సాయి . ఏది అయితే ఎవ్వడు మాట్లాడకూడదు అని అనుకొన్నాడో అదే మళ్లీ మధ్యలోకి వచ్చి పడింది. నేను ఇబ్బంది గా కదుల్తు "అరె ఏమి చెయ్యనురా, అప్పటికి ట్రై చేశాను కదరా". అంటూ దీనంగా అన్నాడు. "సర్లే రా, సాయంత్రం నించి మొదలు పెడదాం. అస్సలు ఏమి చెయ్యకుండా ఉండము కదా" అని అక్కడ నించి అందరు కదిలారు.
విజయవాడ లోని సత్యనారాయణ పురం రైల్వే కాలనీ లో భోగి మంటలు అంటే అది ఒక వరల్డ్ కప్ పోటి లాగా జరుగు తుంది. కాలనీ లో ప్రతి లైన్ లో కనీసం 30-35 quarters ఉంటాయి. ఈ లైన్ ల మధ్యల్లో క్రికెట్ మ్యాచ్ పోటీలు, కొట్లాటలు, రాయభారాలు అన్నీ వీర లెవెల్ లో ఉండేవి. ఇంకా భోగి పండగ అప్పుడు మా కాలనీ లో మాత్రమే ఒక విచిత్రమైన పోటి ఉండేది. ఎలా మొదలు అయ్యిందో ఏమో కానీ, ఒక లైన్ వాళ్ళు వేసిన భోగి మంట పక్క లైన్ వాళ్ళ మంట కంటే పెద్దగా మరియు ఎక్కువ సేపు ఉంటె వాళ్ళు ఇక కాలర్ ఎగర వేసి తిరగ దానికి free license వచ్చిన్దన్నమాటే. దీని కోసం జనం దగ్గర ఉన్న చెక్క సామానులు, కాలనీ లో పెరిగిన పిచ్చి చెట్లు, ట్రాక్ వెంబడి ఉన్న తుమ్మ పొదలు ఇలా అన్ని రకాల సామాగ్రి కోసం చాల డిమాండ్ ఉండేది. మా లైన్ లో ఆడపిల్లలు భోగి మంట బాగా పెద్దగా వస్తే మమ్మల్ని చూసే అదో రకం చూపుల తో మా జన్మ తరించేది. పైగా నాకు ఈ సీజన్లో లో ఒక స్పెషల్ స్టేటస్ ఉండేది. మా నాన్నగారు రైల్వే లో PWI (track inspector) ఉద్యోగం లో ఉండే వారు. ఆ మధ్య కాలంలో విజయవాడ డివిజన్ లో అంత బ్రిటిష్ వాళ్ళు వేయించిన రైల్వే ట్రాక్స్ లో చెక్క స్లీపెర్ లు తీసేసి సిమెంట్ స్లాబ్ స్లీపెర్లు వేసే ప్రాజెక్ట్ వర్క్స్ జరిగేవి. దాంతో ఈ చెక్క స్లీపెర్లు చాల వరకు అవతల పారేయడం లేదా auction లో అమ్మేయడం చేసే వాళ్ళు. మా నాన్నగారు ట్రాక్ ఇన్స్పెక్టర్ కావడంతో అడపా తడప కాలనీ లో వాళ్ళు వాళ్ళ quarter కి ఫెన్సింగ్ లేదా ఇంటికి గేటు వేయించు కొంటామంటే అయన లోపాయికారీ గా వాళ్ళ కి సహాయ పడే వాళ్ళు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేయించిన స్లీపెర్ కట్టెలు కావడం తో చాల నాణ్యంగా చాల సేపు మంచి మంట ని ఇస్తూ కాలేవి ఇవి. ప్రపంచం లో అందరకి స్లీపెర్ లు మా నాన్నగారు sanction చేసే వాళ్ళు కానీ మా లైన్ పరువు గురించి అయన ఎ మాత్రం ఖాతరు చేసే వాళ్ళు కాదు. మా లైన్ లో seniors భోగి ని organize చేసే అప్పుడు ఎప్పుడు మాదే పై చేయి. ఒక రెండు భోగి పండగల క్రితం కాలనీ లోకి మేము కొత్తగా రావడం, మా నాన్నగారు ఏదో మూడ్ లో కుర్రాళ్ళు ముచ్చట పడటం చూసి ఒక స్లీపెర్ కట్టి ఇవ్వడం, మా భోగి మంట కాలనీ మొత్తానికే పెద్దది అవ్వడం తో నా లెవెల్ చాలా విపరీతంగా పెరిగి పోయింది. కానీ తర్వాత ఇది ఏదో అయన ఉద్యోగానికే ఎసరు పెట్టేది గ అని అనిపించిందో ఏమో, మా నాన్నగారు ససేమిరా అన్నారు. మా టీం అంత ట్రాక్ వెంబడి పడుతూ లేస్తూ తుమ్మ మొక్కలు, ఇంకా రకరకాల చెక్క సరుకు పోగు చేసినా కూడా థర్డ్ లైన్ వాళ్ళ కాలి గోటి కి కూడా సరి పోలేదు. మా ఓటమికి మిగతా కారణాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకి కొంచం కండ పుష్తి ఉన్న వాళ్ళు మా బలగం లో నించి ఇంజనీరింగ్ లో సీట్ రావడమో లేదా transfer అయ్యి వేరే ఊరు వెళ్లి పోవడమో జరిగాయి. ఇంకా చివరి నిమిషంలో మా భోగి మంట సామాన్లు కొన్ని మా రక్షణ లోపించడంతో తగ్గడం, మంట జరిగే సమయంలో ఒక strategy లేకుండా సరుకు వెయ్యడం ఇలాంటివి. కానీ ఇన్ని కారణాలు ని తుంగలోకి నెట్టి వేసి సంవత్సరం పొడుగూత సతీష్ గాడు ఇస్తా అన్న స్లీపెర్ ఇవ్వక పోవడం వల్లే మా లైన్ పరువు గంగలో కలిసింది అన్న మాట నిలిచి పోయింది.
ఈ సంవత్సరం ఎలా అయినా స్లీపెర్ సంపాదించాలి అన్న పట్టుదలతో మా నాన్నగారి దగ్గర ఈ విషయం ప్రతిపాదించా. అయన ఏ కళ మీద ఉన్నారో కానీ "చూద్దాం లేరా" అని అన్నారు. కానీ షరా మాములుగా వచ్చే సంవత్సరం పదో తరగతి. ఈ వేషాలు అన్ని మానేయాలి మరి అంటూ హెచ్చరించారు. అదే పదివేలు అని అనుకోని మా జనాలు అందరు దగ్గర పని అయిపోయినంత build-up ఇచ్చా. సాయి గాడి ఆనందం అంతా ఇంతా కాదు. ఉబ్బి తబ్బిబ్బు అయి పోయి స్పెషల్ shake హ్యాండ్ ఇచ్చాడు. హరి గాడు ఇంక చెప్పక్కర్లేదు. రామ కృష్ణ అయితే సంతోషించాడు కానీ చివర్లో "అరె !! గారంటీ ఏనా" అంటూ చిన్న డౌట్ వేలిపుచ్చాడు. "మదర్ ప్రామిస్" రా ఇస్తా అన్నారు అని మల్లి భరోసా ఇచ్చా. "అయినా కానీ మనం కొంచం సంపాదిద్దాము రా. మొన్న తుఫాన్ కి single quarters పక్కన ఉన్న చెట్టు పడి పోయింది కదా. ఇంకా కొన్ని కొమ్మలు అలాగే ఉన్నాయి. జయ గాడు వాళ్ళు వెళ్ళే లోపే మనం వెళ్లి ముక్కలు చేసి పట్టుకు వద్దాము" అని నూతన ఉత్షాహం తో చెప్పాడు సాయి. "అరె !! ఈ సారి భోగి ముందర రాత్రి ఎవ్వరు నిద్ర పోకూడదు. దొంగ నాయాళ్ళు రా వాళ్ళు. మనం కాపలా కాయక పొతే ఇంక అంతే, తెలుసా" అని హెచ్చరించాడు హరి. "ఆల్రెడీ గ మన దగ్గర బానే ఉన్నాయి రా. మళ్లీ ట్రాక్ వెంబడి వెళ్ళాలి అంటావా" అడిగాడు రామ కృష్ణ.
-- సశేషం
మా తెలంగాణా బ్రతుక్కమ్మాపండుగ గుర్తుకు వచ్చింది
ReplyDeleteI read the whole story. Very interesting..
ReplyDeleteYou put me in tension. I can't wait for Part II of this story !!
by the way, did your dad fulfil his promise by giving the sleeper?
Please don't say "Wait until next week"
-Subba