Wednesday, April 27, 2011

చరిత్ర మరో సారి

తెలంగాణా ఉద్యమం మళ్లీ ఆగింది. దీని అర్ధం, పరమార్ధం పెరుమాళ్ళ కి ఎరుక. కొన్నాళ్ళ క్రితం ఈ ఉద్యమం నిజమైనదే ఏమో అన్న ఊహ తెలంగాణా మరియు ఏతరలుకి తోచిన మాట వాస్తవమే అని గమనించాలి. దీనికి ముక్ష్య కారణాలు.

  1. ఉద్యమం కనీసం ఒక సంవత్సర కాలం సాగింది. ఇంకా మరెంత కాలం సాగుతుందో చెప్పలేక పోతున్నాము.
  2. ఉద్యమ సారూప్యం ఏ విధంగా ఉన్నా ప్రజా బలం ఉందన్న సత్యాన్ని గమనించాలి.
  3. గతం లో ఈ ఉద్యమం వికృత రూపం తీసుకొని ఉన్నా పూర్తి స్తాయి లో ఇది రూపు మాపడం లేదు.  (చెన్నా రెడ్డి నాయకత్వం లో సాగిన ఉద్యమం తో కలుపుకొని)
  4. తమ అవకాశాలని వేరే ఎవరో పూర్తి స్తాయి లో తన్నుకు పోయారు అని తెలంగాణా ప్రజలు బలంగా విశ్వసించబట్టి.
నేను తెలంగాణా ఉద్యమం యొక్క ప్రస్తుత నాయకత్వానికి, ఎత్తుగడలకి, రూపు రేఖలకి పూర్తి స్తాయి లో వ్యతిరేకం అయినా కూడా ప్రజల ఆకాంక్షల ని తప్పు పట్ట గలమా అన్న ప్రశ్న వేసికోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమస్య ని పక్కకి నెట్టడం సరి అయిన వ్యూహం కాదన్న సంగతి చరిత్ర ఇలాంటి ఒక సందర్భం లోనే ఒక సారి నాయకత్వానికి గుణపాటం నేర్పింది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం ఏమైనా ప్రస్తుత పరిణామాలకి పాఠం నేర్పగలదా ? ఇప్పటి వరకు అధ్వానపు అధిష్టానం మరియు రాష్ట్ర (అ)నాయకత్వం స్వీకరించిన నిర్లక్ష ధోరణి రాబోయే తరాలకి ఎటువంటి మార్గ నిర్దేశనం చేయ బోతోంది ?

అప్పటి ఉద్యమం స్వచ్చమైనదా లేక ప్రస్తుత ఆందోళన బలమైనదా ? అసలు ఈ రెండింటి కి సారూప్యమే లేదా ? ఏది నిజమైనది లేదా నిజాయితీ కలది ? అసలు పొట్టి శ్రీ రాములు గారు నిర్వహించిన త్యాగం ఎటువంటిదో తెలుసు కోవాలన్న కుతూహలం తో గూగుల్ లో వెతుకుతూ ఉంటె 2003 లో హిందూ లో రామచంద్ర గుహ వ్రాసిన వ్యాసం ఎందుకో ఆసక్తికరంగా కనిపించింది. కొన్ని నిజాలు మీ కోసం.

డిసెంబర్ 1950 లో సర్దార్ వల్లభ్భాయ్ మరణించారు. నెహ్రు ప్రధాన మంత్రి పదవి తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు కూడా స్వీకరించారు. మరో దశాబ్దం వరకు నెహ్రు అనుకొన్న ఇండియా తీర్చి దిద్దబడడానికి సంసిద్ధం అయ్యింది. ప్రభుత్వ నిర్వహణ, పార్టీ వ్యవహార శైలి ఇలా దాదాపు అన్ని. కాని అనుకోకుండా జరిగిన కొన్నిసందర్భాలు నెహ్రు గారికి పంటి కింద రాయి లాగ, కంటి లో నలుసు గా మారాయి. అందులో ఒకటి....

బాషా పరమైన రాష్ట్ర ఏర్పాటు. కన్నడ, మలయాళం లేదా ఒరియా ఇలా కాంగ్రెస్ పెద్దలు తమ తమ రాష్ట్ర ఏర్పాటు కోసరం పాటు పాడడం మొదలు పెట్టాయి. ఇందులో తీవ్ర స్తాయి లో గళం విప్పింది మాత్రం ఆంధ్రులే. బాషా పరంగా హిందీ మాట్లాడే వాళ్ళ తర్వాత అధికులు తెలుగు వాళ్లే. అంతే కాకుండా బాషా పరంగా విజయ నగర పాలనా నించి వైభవం ని చవి చూసిన జాతి కూడా తెలుగు వాళ్లే. మద్రాస్ మరియు హైదరాబాద్ లలో అత్యంత చురుకు గా ఆంధ్ర మహాసభ సభ్యులు తమిళుల ఆధిపత్యాన్ని ప్రశ్నించసాగారు. మద్రాస్ అసెంబ్లీ లో ఆంధ్ర శాసన సభ్యులు ఆంధ్ర ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు నకు సంఘీభావం వ్యక్త పరిచారు.

ఆంధ్ర రాష్ట్ర ఆందోళన ఇద్దరికి మాత్రం ఏ మాత్రం రుచించలేదు. నెహ్రు మరియు రాజగోపాలాచారి మాత్రం రాష్ట్ర ఏర్పాటు నకు అది సరి అయిన సమయం కాదని కొట్టి పారేసారు. ఆ సమయం ఏదో, ఎప్పుడు వస్తుందో తేల్చాల్సిందే అని ఆంధ్రులు పట్టుబట్టారు. పొట్టి శ్రీరాములు అన్న ఒక గాంధేయవాది తన జీవితం లో రెండవ సారి నిరాహార దీక్షలో కూర్చొన్నారు. మొదటి సారి మద్రాస్ లోని ఆలయాల్లో హరిజనుల ప్రవేశం కోసం 1946 సంవత్సరంలో దీక్ష చేసారు. అప్పటి మద్రాస్ లో ఉన్న కాంగ్రెస్ వాదులు స్వతంత్ర ఉద్యమం నకు ఇది ఒక అడ్డంకి అని భావించి గాంధీ గారిని పొట్టి శ్రీ రాములు చేత దీక్ష విరమణ చేయమని అభ్యర్ధించారు.  గాంధీ గారి అభ్యర్ధన మేరకు అప్పటి దీక్ష విరమించినా 1952 నాటికి తెలుగు రాష్ట్ర సాధనకై మళ్లీ ఉద్యమం చేపట్టారు.

"ఏదో ఒక నిరాహార దీక్ష అంటూ మొదలు పెట్టారు అని వార్త నా దృష్టి కి వచ్చింది. మనం ఎటువంటి పరి స్తితులలో అయినా కూడా ఈ యొక్క ఆందోళన కి ప్రాధాన్యత ఇవ్వరాదు" అని రాజగోపాలాచారి ఉత్తరం పంపారు పండిట్ నెహ్రు. అప్పటికే శ్రీరాములు గారు ఆరు వారాల బట్టి నిరాహార దీక్ష ని నిర్వహించారు. ఆధిపత్యం లో ఉన్న పెద్దలు ప్రత్యెక రాష్త్ర ఏర్పాటు నకు సరియైన సమయం రాలేదు అనే నమ్మారు అదే విషయం పార్లమెంట్ లో పదే పదే నమ్మించ డానికి ప్రయత్నం చేసారు.  దీక్ష అలాగే కొనసాగింది. రాష్ట్ర నలుమూలల రాజాజీ మరియు నెహ్రు ల వ్యతిరేక నినాదాలు పెల్లుబికాయి. నెహ్రు కి దిగిరాక తప్పలేదు. ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు కై మళ్లీ ఇంకొక లేఖ వ్రాసారు. కాని దురదృష్త వశాత్తు అధికారిక ప్రకటన వచ్చేలోపే పొట్టి శ్రీ రాములు గారు గతించారు. ఆంధ్ర రాష్త్రము అతలాకుతలం అయ్యింది. రైళ్ళు తగల పెట్టారు. పట్టాలు పీకేశారు. ఆంధ్రుల ఆగ్రహం తీవ్రత అంటే ఏంటో దేశమంతా చాటారు. సామరస్యంగా జరగవలసిన  విభజన రక్తపాతం తో జరిగింది.

మళ్లీ రాబోయే తరాలు ఈ విధమైన విభజన ని ఎదుర్కోవాల్సి వస్తుందా ? ఏ పాపం తెలియని నవ తరాల మనస్సులని విభజించే సావకాశం కల్గుతుందా ? చూద్దాం !!

Friday, March 4, 2011

భారత ఉపఖండం లో క్రికెట్

ఒప్పుకోడానికి కష్టం గా ఉన్నా క్రికెట్ స్వరూపము, సారుప్యత పూర్తిగా మారింది భారత ఉపఖండం లో ప్రాచుర్యం పొందిన తర్వాత. నిజంగా విశ్లేసిస్తే ఇది మనకి అసలు తగునా అని అనిపిస్తుంది. గత రెండు మూడు దశాభ్దాలు లలో అన్ని ఆటల తీరు తెన్నులు మారి నట్టే క్రికెట్ కూడా మారినా గత కొన్ని సంవత్సారాలలో జరిగిన పరిణామాలను చూస్తే ఈ విపరీత ధోరణులకి మనమే కారణం అని ఒప్పుకోక తప్పదు. నేను ఉత్తర అమెరికా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక తెల్ల అయన "Cricket used to be a relaxing and laid back sport until you and Pakistanis started winning it" అని అన్నప్పుడు ఈ వెధవలు ఇంతేలే ఇలా జాత్య అహంకారంతో మాట్లాడతారు అని అనుకొన్నాను. చూడగా చూడగా కొంచం నిజమే అనిపిస్తోంది. హైదరాబాద్ లో ఎవడైనా పాకిస్తాన్ టీం విజయం ని హర్షిస్తే వాడు తప్పకుండా "ISI" ఏజెంట్ అని ముద్ర వేసి పడేస్తాము. దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం అమెరికా లో ఇండియా టీం డేవిస్ కప్ ఆడదానికి వస్తే మేము ఒక పది మంది కలిసి "ఇండియా జిందాబాద్" వంటి స్లోగన్ లతో రచ్చ రచ్చ చేసాము. అమెరికా దేశస్తులు మా దగ్గరకి వచ్చి ఫొటోస్ కూడా తీసు కొన్నారు.


ఈ రోజు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మెంబెర్ ఒక అయన మా ఫాన్స్ వేసిన రాళ్ళు గురితప్పి వెస్ట్ ఇండీస్ వాళ్ళ బస్సు మీద పడ్డాయి, కొంచం సర్దుకోండి అని చెప్పడం కొంచం విడ్డురంగానే ఉంది మరి. నిన్న ఇంగ్లాండ్ ఐర్లాండ్ తో ఒడి పోయి నప్పుడు ఎంత మంది క్రికెటర్ ఇళ్ళ మీద రాళ్ళు వేయబడ్డాయి. పోనీ క్రికెట్ కాదు, ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో ఓడినప్పుడు ? 2007 లో ధోని ఇంటి గోడలు కి నల్ల రంగు వేసారు అంటే సిగ్గు పడ్డవారు ఎంత మంది ? naaku తెలిసిన కొంత మంది "తప్పేముంది అండి" అని కూడా వాదించారు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏమిటి అంటే నిజంగా అవతల టీం బాగా ఆడి నెగ్గినా ఇందులో ఏదో మతలబు ఉంది ఏమో అని వ్యాఖ్యానిస్తున్నారు.

Ashes లో జరిగింది అంటే అవి విశేష పరిస్తితులు అని నేను భావిస్తున్నాను. ఇవ్వాల్టి రోజున క్రికెట్ ఆడేవాళ్ళు మనుష్యులు కాదు రోబోలు అని అనుకోమంటే ఎలా అండి. ఓటమి అస్సలు అట లో ఒక భాగమే కాదు అని వాదించే వాళ్ళని ఏమంటాము అండి ? ఒక మారు విజయవాడ రైల్వే స్టేషన్ లో మ్యాచ్ చూస్తూ ఉన్న సందర్భంలో గంగూలీ ఒక బాల్ కొట్టడం మిస్ అయితే "వీడికి నగ్మా తో తిగుగుళ్ళు ఎక్కువ అయితే బాల్ ఎక్కడ కనపడుతుందండి" అంటూ ఒకడి కామెంట్ వినపడింది. వెంటనే బాల్ ని సిక్స్ కొడితే "గంగూలీ కి తగిలితే దొరకదు గురువు గారు" అని అదే వ్యక్తి.

క్రికెట్ మ్యాచ్ ల కోసం హోమాలు, యజ్ఞాలు మరియు పూజలు. ఎంటండి ఇది ? అర్ధం ఉంటుందా ? పోనీ మనమే అనుకొంటే పాకిస్తాన్ వాళ్ళు మరీ మూర్ఖులు. పక్కన ఉన్న శ్రీ లంక వాళ్ళని అయినా చూసి బుద్ది తెచ్చుకొందాము అని ఉండదు. ఎంత హుందా గా వ్యవహరిస్తారో ఆటలా విషయములో ?

వికెట్ తీసి చాతిలు బాదుకోవడం, సెంచరిలు లు కొట్టి భూమి ని తాకుతూ ప్రార్ధనలు చెయ్యడం పాకిస్తాన్ వాళ్ళే నేర్పించారు అనుకొంటా. డ్రెస్సింగ్ రూం లలో మత ప్రార్ధనలు !! మన వాళ్ళు ఏమి తీసిపోరు లెండి. గవాస్కర్ లాంటి పెద్దలు కూడా సంనయనం ని కోల్పోయి కామెంటరీ చెపుతూ రెచ్చగొడతారు. వాళ్ళు ఏమి మాట్లాడతారో వాళ్ళకే అర్ధం కాదు. వీళ్ళ కామెంటరీ గురించి వ్రాయాలంటే కనీసం ఇంకో నలుగు అయిదు బ్లాగ్ లు పడుతుంది అనుకోండి.

Monday, February 21, 2011

పొగడ్తలు

భగవాన్ కీర్తన  ప్రియ !! ఆయనకే ఈ రిమ్మ తెగులు ఉంటే మనమెంత వాళ్ళ మండీ  ? ఆయనేప్పుడో చేసిన ఘన కార్యలన్నీ ప్రతి నిత్యం "సహాస్రం" పాటు తలుస్తూనే ఉంటామే. ఎవడైనా మన విభూతిని పొగిడితే వెంటనే మనస్సు లో నించి తీసి వేయలా ? ఎంత అన్యాయం అండీ !! అసలు ఇవ్వాల్టి రోజుల్లో ఎవడైనా మనసారా "చాల మంచి చేసారండీ" అన్న అభినందనే కరువై పోతూ ఉన్న రోజుల్లో మళ్లీ ఇది కూడా జోడిస్తే, ఇంకా ఏమైనా ఉందా ?

చెప్పద్దూ !! పొగడ్త లేని నాడు ఏ పని చెసినా నిరర్ధకం అనిపిస్తుంది కదండీ !! కాళ్ళ కి వేసు కొన్న చెప్పులు, కళ్ళకి పెట్టుకొనే జోడు, చేతి కి పెట్టుకొనే వాచ్, నడుముకి పెట్టె బెల్ట్, మెడలో వేలాడే గొలుసు ఇలా కాదేది పొగడ్త కి అనర్హం !! కొత్తగా చొక్కా వేసుకొంటే ఎవడూ బావుంది అని అనక పొతే ఏదో వెలితి. ఆటలైనా, పాటలైనా, మాటలైనా లేక వ్రాతలైన ఇలా ఏది చేసినా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాం అన్న మాట ఒట్టి నీళ్ళ మీద మూటే !! అంతే కాదండీ మన అలవాట్లు, కార్య సిద్ది, పట్టుదల, నిర్వహణ ఇలా ఏదైనా సరే పక్కవాడు గమనించాలి అనే కోరతాం. లేని నాడు చేసిన పని కి సార్ధకత ఏదండీ ? ఎంత మంది ఉంటారు అండి సఫిలీకృత నిర్వహణకి కారణభూతం "నేను" కాదు అని అనగలిగిన వాళ్ళు. పొగడ్త ని చేయించిన వాడికే వదిలేసి నాదేమి లేదిందులో అని అనుకోవడం నిజానికి సాధ్యమా? పోనీ పొగిడే వాడు మనసార అభినందిస్తాడా అంటే అది ఎట్టి మాత్రం ప్రస్తుత కాల మాన పరిస్తితులలో సాధ్యం కానిది. పైగా రెండు మూడు సార్లు అలవాటు పడిన ప్రాణం నాలుగో సారి ఏమీ ప్రతిస్పందన లేక పొతే లేని పోనీ వైషమ్యం.

అంత పని చేసేసి "అమ్మా !! ఏమీ చేతకాని వాళ్ళని దూత గా పంపిస్తారు. ఉన్నవారంత నా కన్నా అధికులు, సములు గాని, తక్కువ వారు లేరమ్మా" అని త్రికరణ సుద్ది గా అనగలిగిన మానసిక పరిణితి ని ప్రదర్స్తిస్తారు హనుమ సుందర కాండలో. పైగా రాముల వారి దగ్గరకి సీతమ్మ కనుగొనపడినది అన్న వార్త చెప్పిన వారిలో చివరి వ్యక్తి హనుమే. స్వామి మన అందరకి ఏమైనా సందేశం ఇచ్చారా ? ఆచరణ సాధ్యం కానిదా ? ఏమో ..

"పోగిడితే చాలు బాజా కొట్టేమని మా సెగట్రీ ఎట్టించాడు" అంటూ ముత్యాల ముగ్గు లో రావు గోపాల రావు సెలవిచ్చినట్టు, మన మనసు లో సేపెరేట్ గా ఒక డిపార్టుమెంటు ఎట్టించాలేమో ఎవడైనా పొగిడితే బాజా కొట్టేయడానికి, అవి మన తల లో పేరుకు పోకుండా ఉండడానికి.

Wednesday, February 9, 2011

సుగ్రీవ విజయం

 రామాయణ అంతర్గతం గా కిష్కింద కాండ లో వివరింపబడిన ఒక అద్బుత సంఘటన మీకు వివరిస్తాను. ఇది నా ప్రజ్ఞ ఎట్టి మాత్రం కాదు. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు సంపూర్ణ రామాయణము ప్రవచనం విని మననం చేసికొన్న ఘట్టం. మన జీవితాల్లో ఎలా అన్వఇంచుకోవాలో పెద్దలు మీరు అందరు నిర్ణయం చేసికోండి.

"నీ శత్రువు నాకు కూడా శత్రువే" అని సుగ్రీవునికి అభయం ఇచ్చి వాలి ని యుద్దానికి పిలువయ్యా అని మిత్రుడి కష్టం తనదిగా బావిస్తాడు, శ్రీ రామ చంద్రుడు. అప్పుడు సుగ్రీవుడు సాధారణముగా మన అందరి ప్రవర్తిస్తాడో అలాగే వ్యవహరించాడు. ఎవరైనా ఒక మహానుభావుడు సంపూర్ణ మనస్సు తో మన దగ్గరకి వచ్చి మిత్రత్వం ప్రకటిస్తే "పెరటి మొక్క వైద్యానికి పనికి రాదు" అన్న చందాన రక రకాల నిర్లక్షానికి గురి చేస్తాము. మా అన్నయ్య ఇంత బలం, వేగము ఉన్నవాడు అని రాముడి ని అనుమానిస్తునట్టు బహిర్గతం చెయ్యకుండా అత్యంత లౌక్యం గా అయన కి సకల పరిక్షలు జరిపించాడు. ఈ క్రమంలో తన మనస్సు లో ఉన్న అనుమానాలు బయట పడకుండా తన పాండిత్యం అంతా ప్రదర్శిస్తాడు. అంటే సుగ్రీవుడు రాముడిని నమ్మాడు "కాని" ఎక్కడో ఏదో అనుమానం. మనమైన కూడా మన జీవితాల్లో ఎక్కడా సంపూర్ణ విశ్వసనీయత, శరణాగతి ప్రదర్సన చేయడానికి సకల అడ్డంకులు ఎదురు అవుతాయి. "కలడో లేడో" సందిగ్నత మనలని సదా వెంటాడుతూనే వుంటుంది. తద్వారా కార్యసిద్ధి మరియు ఆత్మ సంతృప్తి కలగక పోవడం !! ఎన్నో వాటి కోసం వెంపర్లాడిన తర్వాత చివరికి వెలితి. బహుశా మన అందరిలో ఉండే మానసిక జాడ్యం అయ్యుండవచ్చు. వాలిని పిలిచాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు కానీ అన్నీ యాంత్రికమే!! రాముడి సహాయం అందుతుందో లేదో లేక వాలి ని నిహతించే అంత శక్తి రాముడికి ఉందొ లేదో ఇలా అన్నీ అనుమానాలే. అనుకొన్నట్టే కార్యం నెరవేరలేదు.


మళ్లీ మన అందరిలాగానే రాముడి ని నిందిస్తాడు. సరే రాముడు వాలి మరియు సుగ్రీవుడు మధ్య వైవిధ్యం ఎందుకు గమనించలేక పోయాడో అనేది మరొక ధర్మ సూక్షం అనుకోండి. (ప్రాజ్ఞులు చెప్పిన ప్రవచనాలు చాల అందుబాటులో ఉన్నాయి, మీకు నిజముగా తెలుసు కోవాలి అంటే). ఈ సారి సుగ్రీవుడు సంపూర్ణ శరణాగతి చెయ్య గలుగుతాడు. ఇది చెయ్యగలిగిన వాడి మానసిక దృక్పదం ఈ విధం గా మారుతుందో అయన మళ్లీ వాలిని యుద్దానికి పిలవడానికి వెళ్తున్నప్పుడు జరిగిన విషయాల వర్ణన ని గమనిస్తే తెలుస్తుంది.


సుగ్రీవుడు ఈ సారి మార్గ మద్యం లో గతం లో మహాత్ములు నివసించిన ప్రదేశాలు ప్రస్పుటం గా కనపడతాయి. వాటిని దాటుతున్నప్పుడు వారి వారి సత్ప్రవర్తన ని మననం చేసికొంటూ అత్యంత భక్తీ శ్రద్దలతో స్మరిస్తాడు. ఇది ఒక మనిషి లో పాజిటివ్ అవుట్లుక్ ఉంది అన్నదానికి నిదర్శనము కాదా!! ఈ చిన్న మార్పుతో విజయలక్ష్మిని వరించిన సుగ్రీవుడు ని గమనిస్తూ మన జీవితాలని కూడా తీర్చు దిద్ది కోవచ్చు అన్న ఆలోచన తో ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

Friday, February 4, 2011

నమ్మకాలు - భయాలు

మనం నమ్మిన కొన్ని విషయాలు ఎప్పటకి తప్పు కాకూడదు లేదా ఇంకోలా జరిగితే ఒప్పుకోలేని మనస్తత్వం మనిషి ని మూర్ఖం వైపు కు తిప్పుతుందా ?? అందరు వేసుకోవాల్సిన ప్రశ్న!!  
ఉదాహరణకి భూమి వయస్సు అయిదు వేల సంవత్సరాలు అని కొన్ని ప్రామాణికాలు చెప్పాయి. తర్వాత కాలక్రమేనా పురావస్తు శాస్త్రవేత్తలు "కాదండీ !! 20 నుంచి 100 మిల్లియన్ సంవత్సరాలు ఉంటుందేమో" అని అన్నారు. తర్వాత మళ్లీ సరిదిద్దారు. ప్రస్తుతానికి 4.54 బిల్లియన్ సంవత్సరాలు అని నిర్ధారించారు. ఈలోగా చాల మంది బుర్రలు బద్దలు కొట్టుకొని ఉండి ఉంటారు. సకల జీవ జాలం నించి పరిణితి చెంది అది మానవుడు ఆవిర్భావం ఒక అయిదు నించి ఆరు వేల సంవత్సరాలు క్రితం జరిగి ఉంటుంది అని అన్ని పుస్తకాలలో అచ్చు వేయించారు కొంత మంది పెద్దవాళ్ళు చాన్నాళ్ళ ముందట. పురాణాలూ, బైబిల్ ఇంకా ఇతర చాదస్తాలు అన్నీపక్కకి తోసేసాము అని అన్నారు. నిజమెంతో అని మళ్లీ తర్వాత జరిగే శాస్త్రీయ పరిసోధనాల్లో అనుమానాలు మొదలు అయ్యాయి. రాజ్యం లో ఉన్నవాడు అచ్చువేయించి "నమ్ముతార చస్తారా" అని అన్నప్పుడు, వేరే సిద్ధాంతాల ని హేళన చేసిన నాడు తాత్కాలికం గా అయిన మనుషుల్లో భావోద్వేగాలు వచ్చి ఉండకుండా ఉంటాయా? మీలో ఎవరికీ అయినా భగవంతుడు వేరే మతం వాళ్ళు కొలిచే రూపం లో ప్రత్యక్షం అయ్యి జనావళి కి అంతా "ఒరే మూర్ఖులారా !! మిగతా అన్ని విశ్వాసాలు అన్ని తప్పు. ఈ ఒక్క మతమే నిజం" అని చెప్పాడు అనుకోండి. ఒప్పుకోగల సామర్ధ్యం ఉందా మన అందరిలో ??

Inhibitions అంటే తెలుగు లో ఏంటండి?  "అభ్యంతరము, ఆక్షేపణలు". ఒక్కొక్క కాల మాన పరిస్తితి ని బట్టి మూస గా  వీటి మధ్యలోనే పెరుగుతారు.

యూదులు అంత నిరర్ధకమైన ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. వాళ్ళని నాశనం చీసే తీరాలి  - ప్రపంచం లో ఒక ప్రాంతం అంతా కనీసం ఒక రెండు దశాభ్దాలు పాటు దీన్నే నమ్మింది.

ఆర్యులు, అనార్యులు అనే చీలిక హిందూ దేశాన్ని ఎప్పుడో చీల్చింది - ఉత్తర మరియు దక్షిణ భారతీయులు ఒకే వేదమును నమ్ముతున్నా ఒక జాతి కాదు.

పాకిస్తాన్ అనే దేశం లో ఒక్క మంచి వాడు కూడా పుట్టే/పెరిగే అవకాశమే లేనే లేదు - భారతీయ జాతి అంతా  ఈ సిద్దాంతాన్ని ఇంకా నమ్ముతూనే ఉంది. అలాగే అటువైపు వారు బ్రాహ్మణ భారతీయ సంస్కృతి అత్యంత ప్రమాదకరం. నశింప చేసే హక్కు మా మతం మాకు ఎప్పుడో ఇచ్చింది - ఇది పాకిస్తాన్ దేశ ఉనికి కి ఆయువు పట్టు.


పోనీ ఆధునికులు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రజలు వేరే విధం గా ఆలోచిస్తారు అని అనుకోవడానికి లేదు. సామాన్యమైన పరిస్తితుల్లో తాము విశ్వసించిన వాటిని తప్పేమో అని ఎవరు అయినా బయటికి అంటే దాన్ని దారుణంగా అణిచి వేసిన సంభందాలు ఎన్నో ఎన్నెన్నో !!


ఆశ్చర్యమైన విషయము ఏంటి అంటే మీరు నమ్మిన విషయము ఇంకొక ప్రాంతం లో కాని సమాజము లో కాని కాలమానము లో పూర్తిగా విరుద్దం అని తెలిస్తే సామాన్యంగా మూర్ఖత్వం ప్రబలుతుంది. బహుశా ఒక శకం మారాలి ఏమో పరిస్తితులు మారటానికి.  అందుకే సమాజం లో పెద్ద పీట లో ఉన్న వాళ్ళు ఇలాంటి సున్నితమైన విషయాల్లో బహు జాగ్రత్త వహించే వాళ్ళు. కొన్ని classified files లో భయంకర నిజాలని అత్యంత గోప్యం గా ఉంచడాన్ని నేను అయితే గొప్ప సమాజ సేవ గానే భావిస్తాను. కొంత శాంతి ఏర్పడినప్పుడు తగు జాగ్రత్త వహించి ప్రజ కి ఇవ్వడాన్ని సమర్ధించాలి అనుకొంటా. ఇవ్వాళ్ళ ఆంధ్ర ప్రదేశ్ లో సామాన్యమైన ప్రజలు ఇంత మీడియా అత్యుత్సహమును చూపడాన్ని "దేశ ద్రోహం" గా చాల మంది పరిగణించడం లో తప్పు ఏమీ కనపడ్డం లేదు.


ఈ యొక్క మానసిక అడ్డంకులు ఏ స్తాయి లో అయినా ప్రబల వచ్చు. వీటిని ఏ మనిషి అయినా ఒక జీవిత కాలం లో అధిగమించ వచ్చు లేదా ఆ సంఘర్షణ లోనే సతమతం అవ్వ వచ్చు. మీ యొక్క నమ్మకాలు జీవితాలని ఉద్దరించవచ్చు లేదా మౌడ్యం లోకి నెట్టేయ వచ్చు. కొంత మంది విపరీత ధోరణి, కాల యాపన, వృధా వైరాలు, కార్పణ్యాలు, వ్యగ్రతలు ఇలా ఎన్నో జాడ్యాలకు గురి అవ్వడం చూస్తూ ఉంటాము.

అలాగే ఇంకో తీరు ఏంటంటే, మీరు నమ్మే సిద్ధాంతం తప్పు అని పని కట్టుకు చెప్పడం వల్ల కొంత మందికి చాల సంతృప్తి ని ఇస్తుంది ఏమో. పోనీ శాస్త్ర పరమైన సిద్దాంతి కరణ జరిగిన తర్వాత ఇలాంటి విమర్సాత్మక మైన ధోరణి నప్పుతుందేమో కాని అల్లా  టప్ప గా మాట్లాడే వాళ్ళని సమాజ విద్రోహులు గానే పరిగణించాలి. "నిజం నిలకడ మీద తేలుతుంది" అన్న మాట అక్షర సత్యం కాదా. ఇవ్వాళ్ళ రోజున వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని మాటల గారడీ తో తిమ్మి ని బొమ్మి చేసి ప్రజల మీదకు రుద్దే మహాను భావులని చూసిన తర్వాతే భూమి ని పిచ్చి పిచ్చి గా పరిశోదన చేసి వయస్సు కనిపెట్టే ప్రయత్నం ని మానవాళి అందరు హర్షించ వలసిన విషయమే !!! ఇంకా ఇలాంటి నిజాలు ని మరింత నిజమని చెప్ప్పే ప్రయత్నాలు అన్ని చూసి "చాల రోజులు నించి ఇలాంటివి చూసాను" అని మనమందరూ నిలబడిన భూ దేవి ఎన్ని రోజులు నించి చెపుతోందో తెలియాలి కదా.

Monday, January 31, 2011

మా రైల్వే కాలనీ క్రికెట్ - Rules of Engagement

మా రైల్వే కాలనీ క్రికెట్ 
********************

మొన్న వరల్డ్ కప్ ఫైనల్ లో సరి సమానం గా స్కోర్ అయినప్పుడు , మేధావులు ఏమీ చేయాలో తెలియక తలలు బద్దలు కొట్టుకొని , ఎవడు ఎక్కువ బౌండరీలు కొడితే వాడిని విజేత గా ప్రకటిస్తున్నాం అని చేతులు దులిపేసుకున్నారు, తద్వారా సమస్త ప్రజానీకం చేత అక్షింతలు కూడా వేయించుకున్నారు. ఇవ్వాల్టి రోజున ICC వాళ్ళు వచ్చి వాళ్ళిష్టం వచ్చినట్టు రూల్స్ అన్ని తిరగ రాస్తూ ఉంటే, మా కాలనీ లో మేధావులు ఏనాడో ఉచితంగా చేయగలిగిన దానికి వీళ్ళకి ఇంతేసి డబ్బులు ఎందుకు దండగ అని అనిపించక మానదు. 

మేము మా రైల్వే కాలనీ లో అడినదే అసలు సిసలు క్రికెట్ అండి !! నాకు గుర్తు ఉన్నంత వరకు మచ్చుక్కి కొన్ని మీతో మనవి చేస్తాను.
  1. మాకు ఫీల్డింగ్ చేసే అప్పుడు రెండు పోసిషన్స్ సెట్ అయిపోయి ఉండేవి. ఒకటి వికెట్ కీపెర్, మరొకటి bye వికెట్ కీపెర్. వికెట్ కీపెర్ కి మాములు gloves వేసికొని ఉంటే bye వికెట్ కీపెర్ మాత్రం హవాయి చెప్పులు తగిలించు కొని ఉండేవాడు. వీడు సాధారణముగా టీం లోకల్లా చిన్నవాడు కానీ, కొత్త గా వచ్చిన వాడు కానీ లేదా బాల్ డబ్బులు ఎగ్గొట్టిన వాడు కానీ అయిఉంటాడు.
  2. వికెట్ కీపెర్ మరియు bye వికెట్ కీపెర్ కనక ఒక లైన్ లో నిలబడ్డారు అంటేఅంపైర్ ఆ బంతి ని "నో బాల్" గా డిక్లేర్ చేస్తాడు. అటువంటి మహత్తర క్షణాల్లో ఒక బౌలర్ అతి కష్టం మీద బ్యాట్సమెన్ ని క్లీన్ బౌల్డ్ చేసి నెత్తి నోరు బాదుకొన్నా చేయగలిగింది ఏమీ లేదు.  
  3. బౌలర్ ఎటువైపు నించి ఏ చేత్తో బౌలింగ్ చేయ్యపోతున్నాడో అంపైర్ కి తెలియచెయ్యడాన్ని "గార్డ్"  చెప్పడం అని అంటారు. ఈ నియమం బౌలర్ కనక పాటించ లేదనుకోండి, ఆ బాల్ నో బాల్ అయి కూర్చుటుంది. అయితే తర్వాతి బాల్ కి కూడా చెప్ప లేదు అనుకోండి, అప్పుడు కూడాఅంపైర్ అతని తప్పు చెలియ చెయ్యడు. మళ్లీ ఆ బంతి ని "నో బాల్" గానే ప్రకటిస్తాడు. అప్పుడు కెప్టైన్ కలగ చేసుకొంటే "మీ వాడికి గార్డ్ చెప్పాలని ముందు చెప్పమ్మా" అంటూ గీరగా సమాధానం చెప్తాడు.
  4. సాధారణంగా లెగ్ అంపైర్  బాటింగ్ టీం నించి ఉంటాడు. ఒక్కొక సారి ఈ లెగ్అంపైర్ మారే కార్యక్రమం లో బాటింగ్ టీం వాళ్ళు తగిన సమయం లో వాడిని పంపడం మర్చి పోతారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఫీల్డింగ్ టీం వాళ్ళు బంతి తీసుకు వచ్చి స్టంప్స్ ని పడగొడతారు. ఇప్పుడు ఫీల్డింగ్ టీం వాళ్ళు బాట్స్మన్ లేదా రన్నర్ లలో ఎవరో ఒకరిని అవుట్ చెయ్యవచ్చు. పాపం అవుట్ అయిన వాడు టీం కెప్టైన్ ని ఏమి బూతులతో సత్కరిస్తాడో మీకు మళ్లీ చెప్పక్కర లేదు అనుకొంటా.
  5. ఇదే రూల్ లెగ్అంపైర్ బాట్స్మన్ కి లెగ్ సైడ్ కాకుండా ఆఫ్ సైడ్ లో ఉన్నాడు అనుకోండి అప్పుడు కూడా  ఫీల్డింగ్ టీం వాళ్ళు గుంట నక్కల్లాగా వచ్చి బాట్స్మన్ ని నిర్ధాక్షిణ్యం గా అవుట్ చేసేస్తారు. ఇదే విధానానికి బలైన లెఫ్ట్ హ్యాండ్ బాట్స్మన్ పాపం ఎందరో !!
  6. అవుట్ అయిన బాట్స్మన్ బౌండరీ లైన్ ని దాటినా తర్వాత కాని నెక్స్ట్ బాట్స్మన్ లోపలి వచ్చాడు అనుకోండి అప్పుడు అతను ఒక్క బాల్ కూడా ఆడకుండా స్టంప్ అవుట్ చేయ వచ్చు.
  7. చాల సందర్భాల్లో బాటింగ్ ఆర్డర్ కోసం ప్రొఫెషనల్ టీమ్స్ తెగ కష్ట పడుతుంటారు. మా కాలనీ లో అది చాల ఈజీ. ఎవడు బాల్ కోసం ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడు ఓపెనింగ్ బాట్స్మన్, తర్వాతే ఎవడైనా !!
ఏంటి ఇవన్ని అభూత కల్పనలు అని అనుకొంటున్నారా ? మా జీవితాలు మిలిటరీ కమాండ్స్ గా నిలిచిన రూల్స్ ఇవి. నాకు గుర్తు  ఉన్నంత వరకు మీతో షేర్ చేసుకొన్నాను. మీకు కూడా ఇంకా మిగిలి ఉన్న రూల్స్ షేర్ చేస్తే, అందరం కలిసి ఒక గ్రంధం తయారు చేద్దాం.  

జై హింద్ !!

Sunday, January 30, 2011

నటన రాని అగ్ర నటులు

వాచకము, విగ్రహము, ఉచ్చారణ, హావ భావాలూ ఇవేవి లేక పోవడం ఈ రోజున తెలుగు సినిమాలలో అగ్ర నటివర్గం గా చలామణి అవుతున్న వారి యొక్క ముఖ్య అర్హతలు. వాళ్ళ నాన్న, మామ, పెదనాన్న లేక బాబాయ్ ఇలా ఎవరో ఒకరి రక్తం వీళ్ళ ఒంట్లో వుంటే చాలట వీళ్ళు కూడా మహా నటుల జాబితా లో ఇట్టే చేరి పోతారు. కాని ఈ "వా" (వారసత్వం) బ్లడ్ గ్రూప్ ఒక్క తెలుగు హీరో కులానికే వర్తిస్తుంది అట. వీధి లోకి కొత్త కుక్క వస్తే ఎలా అయితే అది నిర్దయగా తరమపడుతుందో, ఈ కుల సంతతి ఈ "హీరో" ఇజంని తమ జన్మ హక్కు గా బావిస్తుంది. ఈ హీరో వర్గం ఒక్క బాధ్యత వట్టి సినిమా లో నటించడం మాత్రమే అని అనుకొంటే మీరు పొరపాటు పడినట్టే. ఉదహరణకి వీళ్ళ సినిమాలు లో పాటించవలసిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి అంటే.
  • సినిమా లో ముఖ్య నటి నట వర్గం ని మొత్తం మీద హీరో నే నిర్ణయిస్తాడు.
  • హీరో యొక్క సామర్ధ్యం ని బట్టి, అతని కన్నా నటన కొంచం అయినా వచ్చిన వాళ్ళని చిన్న చిన్న పాత్రలకి లేక తమ ని ఇంకా ఎలివేట్ పద్ధతి లో తగిన జాగ్రత్త డైరెక్టర్ తో సహా కలిసి తీసుకొంటారు.
  • అన్నిటి కన్నా ముఖ్యంగా హీరోయిన్ తెలుగు మాట్లాడం రాని అమ్మాయి అవ్వాలి. చెప్పా కదా మన హీరో గారు ముందర ఎక్కువ నిడివి లో కనిపించే వాళ్ళు నటన తప్ప మిగతా అన్నిటిలో సమర్ధులు అయ్యి ఉండాలి అని.
  • ఒక్క కమెడియన్ తప్ప మిగతా ఆర్టిస్ట్లు అందరు పక్క రాష్ట్రాలు వాళ్ళు అయి ఉండాలి.
  • డబ్బులు పెట్టె నిర్మాత ఒక పెద్ద supplier మాత్రంగా మిగిలి ఉండాలి.
  • హీరో గారి కి ఇష్టమైన ప్రదేశాల్లో పాటల చిత్రీకరణ జరిగే విధం గా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒక్క పేరుపడ్డ హీరో వర్గీయులు అవ్వడం వలన వీళ్ళకి పెక్కు లాభాలు. మొదటగా వేషాలు కోసం ఎవడి కాళ్ళు పట్టుకోవక్కర లేదు. కను ముక్కు తీరు ఎలా ఉన్నా తిమ్మి ని బొమ్మి ని చేసి వీళ్ళ మొహాలు సరి చేస్తారు. సినిమా చతికిల పడినా కూడా తర్వాతి సినిమాల్లో వేషాలకి డోకా ఉండదు. వీళ్ళకి నటనకి సంభందించిన నైపుణ్యం ఏమి లేక పోయినా కూడా డైరెక్టర్ ప్రతిభతో మరియు గ్రాఫిక్స్ వగైరా లతో సినిమాల్లో ఒక్కింత ఎక్కువగా చూపిస్తారు. మొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ తన చిన్న వయస్సు లోనే వట్టి కనుబొమ్మలతోనే  ఆందోళన నించి ఆనందం హావభావాలు ఎలా మార్చవచ్చో మహానటి సావిత్రి గారు నేర్పింది అట. చాదస్తం కాక పొతే అవన్నీ ఎందుకు అండి సినిమా హిట్ అవ్వాలి అంటే ? సినిమాల్లో డబ్బులు రావాలి అంటే మంచి కధ, direction, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మంచి నటీ నట వర్గం... ఎవడండీ మీకు చెప్పింది ఇవన్నీ. మంచిగా ప్రింట్లు వేయించుకొని ధియేటర్ లు బ్లాక్ చేయించు కోగలిగితే సరిపోదూ !! జనాలు చచ్చి నట్టు వస్తారు అండి.