Showing posts with label Commentary. Show all posts
Showing posts with label Commentary. Show all posts

Thursday, March 17, 2016

భారత మాత కి జై

జన్మంతా నికృష్టమైన ఘోరాలూ, పాపాలు చేసినా ఆ చివరి క్షణములో "నారాయణా" అంటే చాలు, ఏ రికమండేషన్ అక్కరలేకుండానే,VIP దర్శనాలు కూడా ఆపేసి స్వామి వారి చరణారవింద కటాక్షం కలగ చేస్తార"ట".

మళ్ళీ "ట" లు,  "టపాకాయలు", ఏంటీ.. కళ్ళు పోతాయి వెధవ అనుమానము నువ్వునూ !!

అయ్యో భలే వారే.. మన శాస్త్రం లో చెప్పిన తర్వాత మళ్ళీ అనుమానమా!! కాక పొతే ఒక చిన్నపాటి సందేహం!!

మరి కానీ.. ఇంకా ఆలశ్యం ఎందుకు. వదులు .. 

అంటే, వాడుగా ఆ జీవుడు అనక పోయినా,  ఎవడైనా అంటావా లేక చస్తావా అని మెడ మీద కట్టి పెట్టి నప్పుడు, సరేలే అంటే ఒక పని అయిపోతుంది కదా అని ఆ నాలుగక్షరాలు అని గుటుక్కు మన్నాడే అనుకోండి, అప్పుడు కూడా వైకుంట వాశి అవుతాడా అని... 

చిక్కు ప్రశ్నే !! దీనికి సమాధానం స్లోగన్లు ద్వారా దేశోద్దారణ చేద్దామనుకొంటున్న RSS పెద్దలని అడిగితే విటమిన్-డి పాలలాంటి చిక్కటి సమాధానం దొరకొచ్చు అనుకొంటా. 

బానే ఉంది.. అయినా "హిందూ" దేశ అభిమానులు ఏమంత తప్పు చేశారని ఇప్పుడు మిగతా పెద్దలంతా కల్సి మూకుమ్మడి గా ఇంత హడావుడి చెయ్యలట. ఆ చేసేదేదో, 19 వ శతాబ్దం లోనే, కిరణ్ చంద్ర చటర్జీ వ్రాసిన "భారత మాత" నాటకాన్ని బహిష్కరించుంటే ఏ గొడవ ఉండేది కాదు కద. పోనీ, ఆ రోజుల్లో స్వతంత్ర సమరావేశం లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చి పోయామండీ అనుకొందామంటే, వారణాశి లో మహాత్మా గాంధీ గారు "భారత మాత" గుడి అవిష్కరిస్తూ, ఈ స్వరూపం కుల మత తత్వాలకు అతీతం గా అందరికి ఆరాధ్యం అవుతుంది అని అన్నప్పుడు, అయ్యా బాపూజీ !! బాగానే ఉంది గాని, మేమంతా ఈ కొత్త దేవత ని అంగీకరించాలంటే, కొన్ని మార్పులు చేర్పులు చేయ వలసి ఉంటుంది. మచ్చుక్కి, ఈ  భారత మాత కాషాయం కి బదులు ఆకూ పచ్చ చీర కట్టండి.. అసలు చీర కాకుండా శాల్వార్ కమీజ్ వంటి వస్త్ర ధారణ చేయించ గలరా ?? ఇంకా మాట్లాడాలంటే, భారత "మాత" కి బదులు "మియా" , "బాబు" లేక "భాయ్" వంటి ఇత్యాదులు ని ఖాయం చెయ్యగలరా అని అడిగుండవచ్చు కదా. పోనీ, గాంధీ గారంటే భక్తీ శ్రద్దలతో అడగాడినికి మొహమాట పడ్డారనుకొన్నా, కాంగీయుల అరవై సంవత్సరాల పాలన లో భారత మాత చల్లని చూపులతోనే, కుల మత వర్గ ప్రాంతీయ విభేద రహిత (భరిత) నవ సమాజ నిర్మాణం ఎటువంటి మొహమాటాలు లేకుండా నిర్మించుకోన్నాము కదా. 

అతి తెలివి ప్రదర్శించ కండి !! అప్పటికి ఇప్పటికి సాపత్యమా ? ప్రభుత్వం అంటే బజారు రౌడీలా ? మేం ఏమి, ఎంత, ఎలా తినాలో, మాట్లాడాలో దిశా నిర్దేశం చేస్తూ ఉంటే గాజులు తొడుక్కొని కూర్చోవాలా? (మీకు తెలియదేమో మొన్న మహిళా దిన ఉత్సవ సందర్భం గా "గాజులు తోడుక్కోవడం" అన్న ప్రయోగాన్ని నిషేదించడం అయినది). మొన్నటికి మొన్న ఉత్తర ప్రదేశ్ లో గో మాంసం తిన్నాడన్న నెపం మీద చంపేయడం అయినది. ఏ మేము ఈ దేశ వాశులం కాదా?? ఏంటీ నిభంధనలు ?? 

ఎక్కడో మారు మూల గ్రామంలో, ఎవరో కొంత మంది అతి వాదులు చేసిన మురికి కి  జాతి మొత్తం పసుపు నీళ్ళు చల్లు కోవాలంటే ఎలా? దాని కోసం  మీరంతా చేసిన గోల అంతా ఇంతా? ఒక ప్రముఖ సినీ నటుడు మొత్తం దేశానికే "అసహన" రోగం వచ్చిందని అని అన్నాడే ? ఏదో ఒక సాకు పెట్టుకొని అధికారానికి రాలేదన్న అక్కసు నంతా మొత్తానికే వెల్లడి చేస్తున్నారు కద. ఆ మధ్య ఏమీ పస లేని లలిత్ మోడీ వ్యవహారాన్ని భుజాన వేసికొని ప్రతిపక్షం మొత్తం వర్షా కాల సమావేశాలు సమయాన్ని "మూర్చ" రోగం వచ్చిన వాళ్ళ కి మల్లే అరుపులు కేకలు తో హొరెత్తించారే ? (అది మొదలు పాలక పక్షం ప్రతినిధులు మూర్చ రోగ ఉపశమనానికి తాళల గుత్తులు పక్కనే పెట్టుకొని తిరుగుతున్నట్టు వినికిడి). 

అవును !! ఆర్ధిక కుంభకోణాలు మేము ఈ మాత్రం సహించము గాక సహించము. (అదే విధం గా ఆర్ధిక కుంభకోణాల పై విచారణలు కూడా). సరే అసలు విషయానికి వస్తే, ఈ బాజాపా ప్రభుత్వం లో కనీ వినీ ఎరుగని రీతిలో పర మత అసహనం ఏర్పడింది.  హిందువులు కాని వారందురూ, ఆత్మ న్యూనతా మరియు అభద్రతా భావం తోను మనుగడ సాగిస్తున్నారు అన్నది అవునన్నా కాదన్నా అక్షర సత్యమ్. ఇలాంటి భావన ఏనాడు స్వతంత్ర భారతం లో ఇనాటి వరకు కలగనే లేదన్నవిషయం గమనించాలి 

నిజమే?? విభజన అప్పటి విషయాలు అప్పటి కొంత భావోద్వేగాలు అని పక్కన పెట్టినా, 84 లో తలపాగా కట్టిన వాడికి తల నీడ లేకుండా చేసిన సంఘటనల మాటో ?? ఇందిరమ్మ ని పొట్టన పెట్టుకొన్న ఇద్దరి సిక్కుల పాపానికి (పుణ్యానికి), మొత్తం జాతిని అత్యంత సహనంగా అసహనానికి గురి చేసిన ఘనత మాట అప్పుడే మరిచారా? కాశ్మీర్ లో వందలకొద్దీ పండిట్ లను ఊచకోత కోసి, సుమారు అయిదు లక్షల మందిని నిరాశ్రయులు చేస్తే, "ష్ !! గప్ చిప్" గా ఉండండి అని నిజాన్ని సమాధి చేసిన ఘటనలు మాటో ? త్రిపుర లో సరస్వితి, దుర్గా పూజలని క్రైస్తవ ఉగ్రవాదం తో దగ్గర ఉండి నిషేదింప చేయడమే కాక అడ్డొచ్చిన హిందువులని ఆ అమ్మలకే బలి ఇచ్చారు? బాబ్రీ మస్జిద్ పొగ పెట్టి ఆ మంటల్లోనే చలి కాచుకొన్న సంస్కృతి మీది !! ఈ కుహనా సిద్ధాంతాలకి కాలం చెల్లింది కాబట్టే సమస్త ప్రజ మిమ్మల్ని పక్కన పెట్టింది.. మీరు భారత దేశం ని చిన్నా బిన్నం చేసిందే కాకుండా, మీ దృతరాష్ట్ర ప్రేమతో కొన్ని విష సర్పాలని పాలు పోసి పెంచారు. ఇప్పుడు అవి కాటు వేయించుకోక పొతే అలక పాన్పు ఎక్కుతున్నాయి. వీటి కోరలు పీకాల్సిందే !! చేసి చూపిస్తాం కూడా

అంతవరకు మిమ్మల్ని ఉండనిస్తే చూద్దాం. అయినా మీ ఒక్క విపరీత ధోరణి వల్ల ఎంత ప్రమాదం ఏర్పడుతోందో గమనిస్తున్నారా? ఇంత కాలం ఆక్షేపణ లేని "భారత మాత" ని తల మీద కత్తి పెట్టినా నెత్తురు ఇస్తాడు కాని తల్లి (దేశ) ప్రేమ ని ఒప్పుకొనంటున్నాడు ఒక పెద్ద  మనిషి. దేశం కోసం ప్రాణం ఇవ్వాల్సిన యువ రక్తమే, అదే దేశ వినాశం కోసరం నినాదాలు ఇస్తోంది !! ప్రముఖ రాజకీయ వేత్తలు, సినీ  నటులు,కళా కారులు, విద్యార్ధి సంఘాలు మరియు కొంత మేరకు పత్రికా రంగం ఈ ఒరవడికి వత్తాశు పలుకుతోంది. చూశారా, మీ నిర్వాకం  ఎటువంటి పరిణామాలకి దారి తీస్తోందో? 

ఏమి చేస్తాం ?? పదవీ కాంక్ష తప్ప మరేమి కానని డొల్ల రాజకీయవాదుల నించి ఇంకేమి ఆశించగలం ?? స్వదేశం లో ఉంటూ, దేశాన్ని  ప్రేమించమనడం అంత చేదు అయిపోయిందా? చరిత్ర లో అభ్రహమ్ లింకోన్, చర్చిల్ ఇలాంటి నేతలంతా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల దేశ నిర్మాణానికే కదా ప్రజలని ప్రాణాలైన ఇమ్మని ప్రభోదించారు ? అప్పట్లో, యూనియన్ సేనలు నివ్వు చెప్పావు కాబట్టి మేము దేశాన్ని ప్రేమించాము అంటే ఏమయ్యేది? మరి ఇప్పడు మీరు అంటున్నారు కాబట్టి "భారత" దేశ కీర్తిని మేము అంగీకరించం అన్న వాళ్లకి వత్తాసు పలికే పెద్ద మనుషలని ఏ  విధం గా అర్ధం చేసికోవాలి?

మన అదృష్టం ఏంటంటే ప్రతీ విషయంలోనూ, ఈకలు ఏరడం  మరియు భూతద్దాల్లో చూడడం లాంటి పనులు బహు కొద్ది మంది మాత్రమే అత్యంత సమర్దవంతం గా చేయడం వల్ల, మిగతా చాల శాతం వ్యవస్థ దాని అంతట దానిగా నడుస్తోంది, పరిగెడుతూనే ఉంది . ఇదే సమయంలో, విజయ్ మాల్య లాంటి ప్రబుద్దులు  వేల కోట్లు బకాయిలు పెట్టి దేశాన్నివదిలి యదేచ్చగా విలాసంగా విహారాలు చేస్తూనే ఉన్నారు. భారత మాత కి జై అన్నా లేకే పోయినా సరిహద్దు లో సైనికులు ఎండనక, వాననక  మంచు కొండల్లో ప్రాణాలు నిలపెట్టుకోవడానికి నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆవలి దేశం నించి ఉగ్ర వాద దాడులు కోన్ సాగుతూనే ఉన్నాయి, మన సైనికులు శక్తివంచన లేకుండా వాటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశ సామాన్య పౌరుడు నిత్య జీవన సంగ్రామం చేస్తూనే అయిదేళ్ళ తర్వాత వచ్చే ప్రజాస్వామ్య ప్రక్రియ లో భాగస్వామ్యం అవడానికి ఓపిగ్గా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ లోగా తనకి ఇష్ట మైన రీతి లో "జై హింద్" అని గాని "భారత్ మాత కి జై"  అని గాని అప్పుడప్పుడు అంటూ తన దేశ భక్తి వ్యక్త పరచటానికి ప్రయత్నం చేస్తున్నాడు 

Wednesday, October 23, 2013

సచిన్ శకం

  • ఈ బొంబాయి కుర్రాడికి 16 సంవత్సరాలే అట !!
  • గవాస్కర్, విశ్వనాథ్ వీళ్ళు ఎవరు పనికి రారు అట !!
  • దొంగ వెధవలు !! చిన్న పిల్ల వాడు అని కూడా చూడ కుండా చూడండీ.. పాపం రక్తం ముక్కు నించి !!
  • మూడు సిక్సర్లు, ఒక్క ఓవర్ లో !! ఖాదిర్ గాడి మొహం చూడాలి !!
  • ఏంటీ వరల్డ్ రికార్డా !! ఇంత కన్నా చిన్న వాడు ఎవడయిన టెస్ట్ సెంచరీ కొట్టాడా?
  • వన్ డే లో ఓపెనర్ గా ఇరగ దీశాడు గా !! 49 బాల్స్ లో 82..
  • సరే నయ్య !! అసలు వన్ డే లో సెంచరీ కొడతాడ అని !!
  • మొత్తానికి 79 మాచేస్ ఆడితే ఒక్క సెంచరీ కొట్టాడు అండీ!!
  • ఇసుకతుఫాన్ వచ్చింది అంటే నమ్మండి !! స్టీవ్ వా గాడి మొహం చూడాలి !!
  • బాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అన్నీ ఒక్కడే చెయ్యాలి అంటే కష్టమే మరి !! అయినా ఏమీ చేస్తాడు అండీ మిగతా వాళ్ళు దండగ మారిన వెధవలు అయితే !!
  • అన్యాయం గా అఖ్తర్ గాడు సచిన్ ని అవుట్ చేసాడు అండీ !! కొంచం నీతి జాతి ఉంటె మళ్లీ వెనక్కి పిలిచి ఉండే వాళ్ళు !!
  • చెన్నై లో పాకిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్ 
    • కష్ట పడి 136 కొట్టాడు కాని పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిపించ లేక పోయాడు అండీ !! అయినా సచిన్ సెంచరీ చేస్తీ ...
    • నోరు ముయ్యి !! విపరీతమైన బ్యాక్ పైన్ పాపం !! అయినా సచిన్ ని అనే వాడివి అయ్యావా ?? ఎంత ధైర్యం ??
  • కెప్టెన్  గా పనికి రాడండీ !! అబ్బే లాభం లేదు !!
  • సచిన్ భార్య అయిదు సంవత్సరాలు పెద్దది అటగా??
  • సచిన్ నాన్న చని పోయాడు. 
    • పాపం అండీ !! మన సచిన్ వాళ్ళ నాన్న చని పోయాడు అట 
    • అయితే, దేశం కోసం అడాల్సిన వరల్డ్ కప్ మధ్యలో ఇంటికి వస్తాడ?
    • వాళ్ళ అమ్మ చూడండీ !! అదే మాట అతనితో చెప్పి మల్లి వెనక్కి పంపింది అట 
  • సచిన్ ఎల్బో ఇంజురీ 
    • సచిన్ పని అయిపొయింది !!
    • టెన్నిస్ ఎల్బో అని... పాపం అండీ !! ఎట్లా ఇండియా టీం ఇంక 
    • అబ్బే !! ఇక లాభం లేదు... ఇదివరకు లాగ అయితే ఆడలేడు 
  • లక్ష్మన్, ద్రావిడ్ ని చూడండి !! సచిన్ ఒక్క రోజు అయినా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడ ?
  • సచిన్ బ్రాండ్ అంబాసిడర్  అయి పోయాడు !! అంత డబ్బు కోసమే నండి.. ఈ హడావుడి అంతా 
  • వన్ డే డబల్ సెంచరీ 
    • అస్సలు ఊహించమా? మన లైఫ్ టైం జరుగుతుంది అని అనుకోలా 
    • సర్లే వయ్యా !! ఇంకో రికార్డు... అంతేగా !!
  • సచిన్ ఇంకా ఒక చిన్న డబల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ లో ఉంటాడు అట. నిజం గా గ్రేట్ అండీ 
  • పాకిస్తాన్ మీద చేల రేగి పోయాడు గా !! వరల్డ్ కప్ లో వాళ్ళ వాళ్ళ కాదు మన మీద గెలవడం !! ఇప్పటి దాక ఆడింది ఒక ఎత్తు, ఇప్పుడు కొట్టిన 95 ఒక ఎత్తు !!
  • సచిన్ కి భారత రత్న ఇవ్వాలి అండీ 
  • ఫైనల్ లో ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ !! సచిన్ ఏమి పీకాడండి.. లారా, పాంటింగ్ చూడండీ !! ఇంపార్టెంట్ మ్యాచ్ లలో చెలరేగి పోతారు 
  • ఇంగ్లాండ్ మీద నాలగవ ఇన్నింగ్స్ లో సెంచరీ !! అందరి నోళ్ళు మూయించాడు గా !!
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • ఆస్ట్రేలియా లో చూసారా !! పిచ్చ ఫారం లో ఉన్నాడుగా !! సెంచరీ మీద సెంచరీ 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • ఆస్ట్రేలియా పిచ్ ల మీద సచిన్ ఒక్కడే ఇంత క్లాసు గా అడగలడు !! (లక్ష్మన్ కన్నానా)
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • మళ్లీ  వరల్డ్ కప్ వచ్చింది గా ?? సచిన్ దీని తర్వాత అయినా... 
  • మళ్ళీ వరల్డ్ కప్ లో మాక్సిమం రన్స్ సచినే 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • 30 సంవత్సరాలు అయిన తర్వాత, మొత్తానికి ఇండియా మళ్లీ వరల్డ్ కప్ నెగ్గారు కదా 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • ప్రతి ఒక్క పిల్ల నాయాలు సచిన్ ని క్లీన్ బౌల్డ్ చేస్తున్నారు ఈ మధ్య 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • సచిన్ వన్ డే నించి రిటైర్ అవుతున్నాడు అట 
    • సచిన్ టెస్ట్ మాచేస్ నించి రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • సచిన్ రాజ్య సభ కి ఎంపీ గా అయ్యాడు అట !!  
    • సచిన్ టెస్ట్ మాచేస్ నించి రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • సచిన్ ఇంకా క్రికెట్ ఆడడు అట.. అయ్యో !! ఇంకా చూడమా ఇంకా సచిన్ ని 
24 సంవత్సరాలు పాటు, తన చుట్టూ నోళ్ళు ఆడుతున్నా, తనని కాదు అని అన్నట్టు గా అతను తనకి తెల్సిన పని చేసికొంటూనే ఉన్నాడు.
ఒక సుశిక్షితుడైన సైనికుడు లాగ 
ఒక కర్తవ్య నిమగ్నుడైన కార్మికుడు  లాగ 
ఒక ఔత్సహికుడైన విద్యార్ధి లాగ 
ఒక నిజాయితి పరుడైన పౌరుడు లాగ 

Saturday, August 31, 2013

ఈ రోజు ముక్ష్యాంశాలు

 "హైదరాబాద్ లో ఉన్న వారంతా తెలంగాణ వారే" -  దామోదర  (జ్యోతి)
"హైదరాబాద్ అందరిది" - తెదేపా ఎమెల్యే లు (ఈనాడు)
"ఇంకా వెయ్యి ఏళ్ళు అయినా హైదరాబాద్ సీమంధ్ర వాళ్ళది అవదు" - హరీష్(జ్యోతి)
"హైదరాబాద్ లో సభ జరిపే హక్కు సీమాంధ్రులకు లేదు" - నాగం (జ్యోతి)
"రాజ్యాంగ బద్దం గా ఎవరు అయినా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు" - డి ఎస్ (జ్యోతి)
"సీమాంధ్ర వాదనలో న్యాయం ఉంది" - చంద్రబాబు (ఈనాడు)
 "తెలంగాణ రాష్ట్రం ఆపే శక్తి ఎవరికీ లేదు" - మధు యాష్కి(జ్యోతి)
 "తెలంగాణ ప్రక్రియ ని వేగవంతం చేయాలి" ఉద్యమ నిర్మాత నాయకులు (ఈనాడు)
"తెలంగాణ ని విభజించి ప్రభుత్వం తప్పు చేసింది"  మధు సూధన్ గుప్తా (సాక్షి)
"తల మొండెం వేరు చేయద్దు" - సచివాలయ ఉద్యోగులు (ఈనాడు)
"విభజిస్తే సీమంద్రకారం" - ఎవరో (సాక్షి)
"ముఖ్య మంత్రిది  అవకాశవాదం" - కోదండ రామ్ (ఈనాడు)
"జగన్ నిరాహార దీక్ష ఎందుకు ఎవరి కోసం" - మోత్కుపల్లి (జ్యోతి)
"ఏడు రోజుల దీక్షతో నీరశించిన జగన్" - నిమ్స్ వైద్యులు (సాక్షి)
"దీక్షలు బగ్నం చేసినా ప్రజల మధ్యనే ఉంటాం" - విజయమ్మ (సాక్షి)
"యాత్ర ఎందుకో చెప్పండి" - ఎ పీ ఎన్ జి ఓ సంఘం అద్యక్షుడు (ఈనాడు)

మాకు  స్కూల్ ఫంక్షన్ లో వార్తలు ని పేరడీ చేసి చదివే ప్రోగ్రాం ఒకటి ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు అవి ప్రత్యేకం గా అక్కరలేదు అనుకొంటా. తెలుగు వాడికి విస్తర్లో అమ్మ (తెలంగాణ తల్లి అయినా, తెలుగు తల్లి అయినా) అన్నీ పెట్టినా, అవకాయో లేక గొంగురో లేదు అని అక్షేపిస్తాడు అట. తెలుగు పేపర్లలో, టీవీ ల్లో గత నాలుగు సంవత్సరాల నించి రకరకాల పచ్చడ్ల పండగే. కాకా పొతే తిని తిని (విని చదవి) కడుపు నెప్పి ఎక్కువ అయినట్టు ఉన్ది.





Tuesday, July 12, 2011

అభిప్రాయలు

 నా అభిప్రాయలు, నా ఇష్టం అని అనుకొన్నప్పుడు పదిమందికి నీ విషయం తెలియాలి అని తాపత్రయం ఎందుకు ? నీకు కలిగిన భావనలు అందరికి తో పంచేసుకోవాలి  అన్న ఆదుర్దా ఎంచేతా ? ఒక వేళ అది రెండో వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తోందని అనిపించినా, నా యొక్క విలువైన ఆలోచనలు చెప్పే తీరుతాను అని అనే మహానుభావులుని ఏమని అనాలి ?
చాలా మంది "నన్ను అడిగితే సార్" అని మొదలు పెడతారు కాని అడిగే దాక ఆగే మర్యాద లేదా శ్రద్ధ వహించరు.అవతల వాళ్ళు అడిగినా అడగక పోయినా తోచింది చెప్పక మానరు. ఈ రోజుల్లో  సోషల్ వెబ్ సైట్స్ లో తమ ఆలోచనలు మరియు అభిప్రాయాలూ తెలియ పరచడం సర్వ సాధారణం అయ్యింది. దీని వలన మంచి లేదా చెడు ఎంతో చెప్పేటంత గొప్ప వాడిని కాకా పోయినా, ఒక సహజమైన సందర్భాన్ని పరిశీలిద్దాము. మనము అందరు ఏదైనా వార్తలు చదివినా లేక చూసినా ఏ విధంగా స్పందిస్తాము ? లేదా ఎవరు అయినా మీతో ఒక విషయం మీద చర్చ చేసినా సరే. దాని తాలూకు ప్రభావం ఎంతో కొంత అవతలి వారిపై ఉంటుంది అన్న సత్యం నిర్ద్వందం. కాగ నిష్పత్తి మారొచ్చు.
ఎందుకండీ ఇంత ఆందోళన ? ఏమి అవుతుందండి ? ఒక సారి వింటారు, రెండో సారి వినీ విన్నట్టు ఉంటారు, తర్వాత నించి వినడం మానేస్తారు కదా !! ఏదో చేస్తూ, మరేదో ఆలోచిస్తూ వంట పట్టించుకొనే వాటితో మనకి ఎటువంటి ప్రమాదం లేదనుకోండి.ఉదాహరణకి శ్రీ రామ నవమి నాడు మన దర్శక రత్నం రామ గోపాలుడు తన ప్రేలాపాలు అన్నీ త్విట్టేర్ ప్రవేశింప చేసి యువ జనావళి ని ఆలోచించ చేసాను అని సంతృప్తి పడ్డాడట. "వేయి వృక్షాలు" కాదు "విష వృక్షాలు" ప్రశస్తం అని నొక్కి వోక్కా నించాడు. అదేమన్నా అంటే భావ, వాఖ్ స్వాతంత్రం అని అంటారు మరి. మరి ఈ సమాజం లో సదరు ప్రముఖులు అంతా వాళ్ళకి ఇష్తం వచ్చినట్టు వారి వారి భావ జాలాన్ని ప్రదర్శిస్తే ఏమీ తప్పు లేదా ?
ఎవరి గురుంచి అయినా చెడు చెప్పడం ఎంత లోకండి ? రోడ్డున పోయే కుక్కలు కూడా మొరుగు తాయి. దేవుడయితే మరీ ఈజీ ? దిక్కు మొక్కు లేని వాడు కదా ? నేను పదమూడు ఏళ్ళ వయస్సు లో ఇండోర్ కి రైల్ లో వెళ్తూ "రంగ నాయకమ్మ విష వృక్షాలు" ఎదురు కూర్చున్న అయన దగ్గర అరువుచ్చుకొని చదివిన విషయాలు ఇప్పటికి కొన్ని జ్ఞాపకానికి ఉన్నాయంటే కొన్ని సంగతులు చెప్పకనే చెప్పబడతాఎమో. విజ్ఞులు ఆలోచించండి. ఈ రోజున సమాచారం ని లక్షల, కోట్ల మందికి చేరవేసే సాధనాలు ఉన్నాయని ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఇష్టానికి ప్రవర్తించ వచ్చా ? 
నిన్న రాత్రి నిద్ర బాగా పట్టిందండి !!
మా వీధి చివర కుక్క బాగా మొరుగుతోందండి !!
మా కార్ లో ఈ రోజు గ్యాస్ కొట్టిన్చానండి
నాకు గళ్ళ చొక్కా కంటే పూల చొక్కా అంటే ఇష్టం
మొక్క జొన్న పొత్తు కి ఉప్పు కారం అద్దుకొని తినడం ఇష్టం
శని అది వారాల్లో స్నానాలు చెయ్య బుద్ది కాదండీ, అసలు ఎందుకు చెయ్యాలి ?
ఫ్యాన్ లేకుండా నిద్ర పట్టనే పట్టాడు సుమా
సచిన్ కి భారత రత్న ఇవ్వరాదు !! ఇంకా కొన్ని సంవత్సారాలు ఆగాల్సిందే !!
మాదిరి చొప్పదంటు సమాచారం ఇంటర్నెట్ లో ప్రపంచం అంతా చాటేసుకోవడం మనకి ప్రస్తుత సరదా. మన లాంటి కోన్ కిస్కా గొట్టం గోపాల కృష్ణ లాంటి అభిప్రాయాలు కొంత మందిని ప్రభావితం చేస్తే ప్రపంచానికి ఒనగూరే (అ) ప్రయోజనం కొద్ది మాత్రమే. అయినా కాని నా నించి నా చుట్టూ ఉన్నసమాజం శాస్త్ర బద్ధ జీవనం ఆశిస్తూ ఉన్న అప్పుడు, ఈ పెద్దలందరికీ ఏ నిభందనలు వర్తించవా ?
మరి ఎవడికి వాడు వాడి ఇష్టానుసారం భావ వ్యక్తీకరణ జరపలేనప్పుడు ఎందుకండీ ఈ ప్రజా స్వామ్యం, స్వతంత్రం ?   దిబ్బలో వేసి కొట్టుకోవడానికా ? అయితే ఒక్క విషయం ఇక్కడ గమనించండి. చరిత్ర లో తమకి అబ్బిన, సిద్దించిన గుణాల ఆధారంగా వారి వారి కాలమానాల్లో ప్రసిద్ది గాంచిన ప్రముఖుల్లో కొద్ది మంది మాత్రమే చిరస్మరణీయులు.  కాగ వీళ్ళందరి లో ప్రస్పుటం గా కనిపించేది "ఒదిగి" ఉండగలగడమే. మరియు వీరంతా నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకొన్నవాళ్ళే. కొద్ది కాలం క్రితమే ప్రముఖ మైన విప్లవాలకి కారణమైన సమాచార మనే పదునైన ఆయుధం, అత్యంత ప్రమాదకరం కాగలదన్న చిన్నపాటి సత్యం సమాజం లో ఉన్నత స్తానాల్లో ఉన్నవాళ్ళ కి తెలియదు అని అనుకోగలమా ? ఆలోచించవలసిందే మరి !!

Sunday, May 15, 2011

బ్లాగానందం

ఏం సార్ !! ఎలా ఉన్నారు ? ఏంటీ కబుర్లు ?
ఏముందండి !! అంతా మామూలే. విపరీతమైన బిజీ అయిపోయాం సార్ !!
ఏంటి ?? ఈ మధ్య ఏమి వదలట్లేదు ? రానీయండి సార్
ఎంటవి?
అవే సార్ !! బ్లాగులు
***********************************************************************************************
ఏంటి సత్య గారు !! వ్రాసార ? కొత్తగా ఏమైనా ?
అంటే వరల్డ్ కప్ కదండీ !! బాగా దగ్గర ఉండి గెలిపిస్తున్నాము !! ఇది ఇంపార్టంట్ కదా !!
కంపుల్సరీ కదండీ మరి !! సెహ్వాగ్ గాడికి మనం కుర్చీ లో లేకపోతె, అస్సలు బాట్ లేవదు తెల్సా ?
అబ్బ!! నిజమా ? అస్సలు కొంచం ఛాన్స్ ఇస్తే వదలరు గా!! దూసుకెళ్ళి పోటమే !!
ఏంటీ నమ్మరా ? బంగ్లాదేశ్ మీద 175 ఎలా కొట్టాడు అనుకొన్నారు ? కావాలంటే మా ఆవిడని అడగండి ?
***********************************************************************************************

తెలంగాణా మీద మీరు వ్రాసింది చాల బావుంది అండి !! ఏంటి మళ్లీ ఏమైనా వ్రాసార ?
ఇంకా లేదు సార్ !! ఉగాది సెలబ్రేషన్స్ తో బాగా బిజీ అయిపోయాము కదా !!
ఏంటీ మీరు బ్లాగ్లు వ్రాస్తార ? దేని మీద పోలిటిక్స్ మీదా?
అవునండి !! మనసుకి ఏది తోస్తే అది ?
మరి లింక్ పంపండి !!
పంపానండి, ఇది వరకు !! మళ్లీ కావాలి అంటే పంపుతా !!
ఓహ్ అవునా !! కరెక్టే నండి !! అదే లింకా ఇంకా ?
అవునండి !! మళ్లీ ఇంకో సారి పంపుతా

***********************************************************************************************
సత్య గారు !! ఆ మధ్య లో ఏదో వ్రాసారు !! ఇంకా వ్రాస్తున్నారా?
ఏదో సార్ !! మీ దయ !! ఎప్పుడైనా వీలుంటే వ్రాస్తున్నాను.
అవునా ?? వెరీ గుడ్ !! వేటి మీద వ్రాస్తారు ?
ప్రత్యేకంగా ఇది అని ఏమి లేదండి !! ఎలా వీలు అయితే అట్లా !!
ఈ సారి నించి మీరు ఏమి చేస్తారంటే, ఏమైనా వ్రాశారనుకోండి... అప్పుడు నాకు ఒక మెయిల్ కొట్టండి, లింక్ పెట్టి
తప్పకుండా అండీ !!

***********************************************************************************************
మనకి ఇండియా లో అనుకోండి !! ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయండి. ఇక్కడనుకోండి.... ఏమి ఉంటుందండి ? ఈ
రోజు కి నిన్నటికి పెద్ద తేడా ఏమీ ఉండదు కదా !!
కరెక్ట్ సార్ !! ఇక్కడ అంతా Monday - Friday లైఫ్ కదండీ !!
రొటీన్ లోంచి బయటకు రావాలంటే చాల ప్రయత్నం చెయ్యాలండి !!
మరి అయితే ఇండియా కి వెళ్లి పోండి సార్ !! అక్కడ అయితే సినిమాల్లో ట్రై చేయచ్చు సార్ !!
అంత సీన్ లేదు లెండి బాబు !!
అట్లా కాదు సత్య గారు !! ఇలాంటి లైఫ్ చేంజ్ మొమెంట్స్ ని మిస్ అవ్వకూడదు సార్ !!***********************************************************************************************

Wednesday, April 27, 2011

చరిత్ర మరో సారి

తెలంగాణా ఉద్యమం మళ్లీ ఆగింది. దీని అర్ధం, పరమార్ధం పెరుమాళ్ళ కి ఎరుక. కొన్నాళ్ళ క్రితం ఈ ఉద్యమం నిజమైనదే ఏమో అన్న ఊహ తెలంగాణా మరియు ఏతరలుకి తోచిన మాట వాస్తవమే అని గమనించాలి. దీనికి ముక్ష్య కారణాలు.

  1. ఉద్యమం కనీసం ఒక సంవత్సర కాలం సాగింది. ఇంకా మరెంత కాలం సాగుతుందో చెప్పలేక పోతున్నాము.
  2. ఉద్యమ సారూప్యం ఏ విధంగా ఉన్నా ప్రజా బలం ఉందన్న సత్యాన్ని గమనించాలి.
  3. గతం లో ఈ ఉద్యమం వికృత రూపం తీసుకొని ఉన్నా పూర్తి స్తాయి లో ఇది రూపు మాపడం లేదు.  (చెన్నా రెడ్డి నాయకత్వం లో సాగిన ఉద్యమం తో కలుపుకొని)
  4. తమ అవకాశాలని వేరే ఎవరో పూర్తి స్తాయి లో తన్నుకు పోయారు అని తెలంగాణా ప్రజలు బలంగా విశ్వసించబట్టి.
నేను తెలంగాణా ఉద్యమం యొక్క ప్రస్తుత నాయకత్వానికి, ఎత్తుగడలకి, రూపు రేఖలకి పూర్తి స్తాయి లో వ్యతిరేకం అయినా కూడా ప్రజల ఆకాంక్షల ని తప్పు పట్ట గలమా అన్న ప్రశ్న వేసికోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమస్య ని పక్కకి నెట్టడం సరి అయిన వ్యూహం కాదన్న సంగతి చరిత్ర ఇలాంటి ఒక సందర్భం లోనే ఒక సారి నాయకత్వానికి గుణపాటం నేర్పింది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం ఏమైనా ప్రస్తుత పరిణామాలకి పాఠం నేర్పగలదా ? ఇప్పటి వరకు అధ్వానపు అధిష్టానం మరియు రాష్ట్ర (అ)నాయకత్వం స్వీకరించిన నిర్లక్ష ధోరణి రాబోయే తరాలకి ఎటువంటి మార్గ నిర్దేశనం చేయ బోతోంది ?

అప్పటి ఉద్యమం స్వచ్చమైనదా లేక ప్రస్తుత ఆందోళన బలమైనదా ? అసలు ఈ రెండింటి కి సారూప్యమే లేదా ? ఏది నిజమైనది లేదా నిజాయితీ కలది ? అసలు పొట్టి శ్రీ రాములు గారు నిర్వహించిన త్యాగం ఎటువంటిదో తెలుసు కోవాలన్న కుతూహలం తో గూగుల్ లో వెతుకుతూ ఉంటె 2003 లో హిందూ లో రామచంద్ర గుహ వ్రాసిన వ్యాసం ఎందుకో ఆసక్తికరంగా కనిపించింది. కొన్ని నిజాలు మీ కోసం.

డిసెంబర్ 1950 లో సర్దార్ వల్లభ్భాయ్ మరణించారు. నెహ్రు ప్రధాన మంత్రి పదవి తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు కూడా స్వీకరించారు. మరో దశాబ్దం వరకు నెహ్రు అనుకొన్న ఇండియా తీర్చి దిద్దబడడానికి సంసిద్ధం అయ్యింది. ప్రభుత్వ నిర్వహణ, పార్టీ వ్యవహార శైలి ఇలా దాదాపు అన్ని. కాని అనుకోకుండా జరిగిన కొన్నిసందర్భాలు నెహ్రు గారికి పంటి కింద రాయి లాగ, కంటి లో నలుసు గా మారాయి. అందులో ఒకటి....

బాషా పరమైన రాష్ట్ర ఏర్పాటు. కన్నడ, మలయాళం లేదా ఒరియా ఇలా కాంగ్రెస్ పెద్దలు తమ తమ రాష్ట్ర ఏర్పాటు కోసరం పాటు పాడడం మొదలు పెట్టాయి. ఇందులో తీవ్ర స్తాయి లో గళం విప్పింది మాత్రం ఆంధ్రులే. బాషా పరంగా హిందీ మాట్లాడే వాళ్ళ తర్వాత అధికులు తెలుగు వాళ్లే. అంతే కాకుండా బాషా పరంగా విజయ నగర పాలనా నించి వైభవం ని చవి చూసిన జాతి కూడా తెలుగు వాళ్లే. మద్రాస్ మరియు హైదరాబాద్ లలో అత్యంత చురుకు గా ఆంధ్ర మహాసభ సభ్యులు తమిళుల ఆధిపత్యాన్ని ప్రశ్నించసాగారు. మద్రాస్ అసెంబ్లీ లో ఆంధ్ర శాసన సభ్యులు ఆంధ్ర ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు నకు సంఘీభావం వ్యక్త పరిచారు.

ఆంధ్ర రాష్ట్ర ఆందోళన ఇద్దరికి మాత్రం ఏ మాత్రం రుచించలేదు. నెహ్రు మరియు రాజగోపాలాచారి మాత్రం రాష్ట్ర ఏర్పాటు నకు అది సరి అయిన సమయం కాదని కొట్టి పారేసారు. ఆ సమయం ఏదో, ఎప్పుడు వస్తుందో తేల్చాల్సిందే అని ఆంధ్రులు పట్టుబట్టారు. పొట్టి శ్రీరాములు అన్న ఒక గాంధేయవాది తన జీవితం లో రెండవ సారి నిరాహార దీక్షలో కూర్చొన్నారు. మొదటి సారి మద్రాస్ లోని ఆలయాల్లో హరిజనుల ప్రవేశం కోసం 1946 సంవత్సరంలో దీక్ష చేసారు. అప్పటి మద్రాస్ లో ఉన్న కాంగ్రెస్ వాదులు స్వతంత్ర ఉద్యమం నకు ఇది ఒక అడ్డంకి అని భావించి గాంధీ గారిని పొట్టి శ్రీ రాములు చేత దీక్ష విరమణ చేయమని అభ్యర్ధించారు.  గాంధీ గారి అభ్యర్ధన మేరకు అప్పటి దీక్ష విరమించినా 1952 నాటికి తెలుగు రాష్ట్ర సాధనకై మళ్లీ ఉద్యమం చేపట్టారు.

"ఏదో ఒక నిరాహార దీక్ష అంటూ మొదలు పెట్టారు అని వార్త నా దృష్టి కి వచ్చింది. మనం ఎటువంటి పరి స్తితులలో అయినా కూడా ఈ యొక్క ఆందోళన కి ప్రాధాన్యత ఇవ్వరాదు" అని రాజగోపాలాచారి ఉత్తరం పంపారు పండిట్ నెహ్రు. అప్పటికే శ్రీరాములు గారు ఆరు వారాల బట్టి నిరాహార దీక్ష ని నిర్వహించారు. ఆధిపత్యం లో ఉన్న పెద్దలు ప్రత్యెక రాష్త్ర ఏర్పాటు నకు సరియైన సమయం రాలేదు అనే నమ్మారు అదే విషయం పార్లమెంట్ లో పదే పదే నమ్మించ డానికి ప్రయత్నం చేసారు.  దీక్ష అలాగే కొనసాగింది. రాష్ట్ర నలుమూలల రాజాజీ మరియు నెహ్రు ల వ్యతిరేక నినాదాలు పెల్లుబికాయి. నెహ్రు కి దిగిరాక తప్పలేదు. ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు కై మళ్లీ ఇంకొక లేఖ వ్రాసారు. కాని దురదృష్త వశాత్తు అధికారిక ప్రకటన వచ్చేలోపే పొట్టి శ్రీ రాములు గారు గతించారు. ఆంధ్ర రాష్త్రము అతలాకుతలం అయ్యింది. రైళ్ళు తగల పెట్టారు. పట్టాలు పీకేశారు. ఆంధ్రుల ఆగ్రహం తీవ్రత అంటే ఏంటో దేశమంతా చాటారు. సామరస్యంగా జరగవలసిన  విభజన రక్తపాతం తో జరిగింది.

మళ్లీ రాబోయే తరాలు ఈ విధమైన విభజన ని ఎదుర్కోవాల్సి వస్తుందా ? ఏ పాపం తెలియని నవ తరాల మనస్సులని విభజించే సావకాశం కల్గుతుందా ? చూద్దాం !!

Monday, February 21, 2011

పొగడ్తలు

భగవాన్ కీర్తన  ప్రియ !! ఆయనకే ఈ రిమ్మ తెగులు ఉంటే మనమెంత వాళ్ళ మండీ  ? ఆయనేప్పుడో చేసిన ఘన కార్యలన్నీ ప్రతి నిత్యం "సహాస్రం" పాటు తలుస్తూనే ఉంటామే. ఎవడైనా మన విభూతిని పొగిడితే వెంటనే మనస్సు లో నించి తీసి వేయలా ? ఎంత అన్యాయం అండీ !! అసలు ఇవ్వాల్టి రోజుల్లో ఎవడైనా మనసారా "చాల మంచి చేసారండీ" అన్న అభినందనే కరువై పోతూ ఉన్న రోజుల్లో మళ్లీ ఇది కూడా జోడిస్తే, ఇంకా ఏమైనా ఉందా ?

చెప్పద్దూ !! పొగడ్త లేని నాడు ఏ పని చెసినా నిరర్ధకం అనిపిస్తుంది కదండీ !! కాళ్ళ కి వేసు కొన్న చెప్పులు, కళ్ళకి పెట్టుకొనే జోడు, చేతి కి పెట్టుకొనే వాచ్, నడుముకి పెట్టె బెల్ట్, మెడలో వేలాడే గొలుసు ఇలా కాదేది పొగడ్త కి అనర్హం !! కొత్తగా చొక్కా వేసుకొంటే ఎవడూ బావుంది అని అనక పొతే ఏదో వెలితి. ఆటలైనా, పాటలైనా, మాటలైనా లేక వ్రాతలైన ఇలా ఏది చేసినా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాం అన్న మాట ఒట్టి నీళ్ళ మీద మూటే !! అంతే కాదండీ మన అలవాట్లు, కార్య సిద్ది, పట్టుదల, నిర్వహణ ఇలా ఏదైనా సరే పక్కవాడు గమనించాలి అనే కోరతాం. లేని నాడు చేసిన పని కి సార్ధకత ఏదండీ ? ఎంత మంది ఉంటారు అండి సఫిలీకృత నిర్వహణకి కారణభూతం "నేను" కాదు అని అనగలిగిన వాళ్ళు. పొగడ్త ని చేయించిన వాడికే వదిలేసి నాదేమి లేదిందులో అని అనుకోవడం నిజానికి సాధ్యమా? పోనీ పొగిడే వాడు మనసార అభినందిస్తాడా అంటే అది ఎట్టి మాత్రం ప్రస్తుత కాల మాన పరిస్తితులలో సాధ్యం కానిది. పైగా రెండు మూడు సార్లు అలవాటు పడిన ప్రాణం నాలుగో సారి ఏమీ ప్రతిస్పందన లేక పొతే లేని పోనీ వైషమ్యం.

అంత పని చేసేసి "అమ్మా !! ఏమీ చేతకాని వాళ్ళని దూత గా పంపిస్తారు. ఉన్నవారంత నా కన్నా అధికులు, సములు గాని, తక్కువ వారు లేరమ్మా" అని త్రికరణ సుద్ది గా అనగలిగిన మానసిక పరిణితి ని ప్రదర్స్తిస్తారు హనుమ సుందర కాండలో. పైగా రాముల వారి దగ్గరకి సీతమ్మ కనుగొనపడినది అన్న వార్త చెప్పిన వారిలో చివరి వ్యక్తి హనుమే. స్వామి మన అందరకి ఏమైనా సందేశం ఇచ్చారా ? ఆచరణ సాధ్యం కానిదా ? ఏమో ..

"పోగిడితే చాలు బాజా కొట్టేమని మా సెగట్రీ ఎట్టించాడు" అంటూ ముత్యాల ముగ్గు లో రావు గోపాల రావు సెలవిచ్చినట్టు, మన మనసు లో సేపెరేట్ గా ఒక డిపార్టుమెంటు ఎట్టించాలేమో ఎవడైనా పొగిడితే బాజా కొట్టేయడానికి, అవి మన తల లో పేరుకు పోకుండా ఉండడానికి.

Friday, February 4, 2011

నమ్మకాలు - భయాలు

మనం నమ్మిన కొన్ని విషయాలు ఎప్పటకి తప్పు కాకూడదు లేదా ఇంకోలా జరిగితే ఒప్పుకోలేని మనస్తత్వం మనిషి ని మూర్ఖం వైపు కు తిప్పుతుందా ?? అందరు వేసుకోవాల్సిన ప్రశ్న!!  
ఉదాహరణకి భూమి వయస్సు అయిదు వేల సంవత్సరాలు అని కొన్ని ప్రామాణికాలు చెప్పాయి. తర్వాత కాలక్రమేనా పురావస్తు శాస్త్రవేత్తలు "కాదండీ !! 20 నుంచి 100 మిల్లియన్ సంవత్సరాలు ఉంటుందేమో" అని అన్నారు. తర్వాత మళ్లీ సరిదిద్దారు. ప్రస్తుతానికి 4.54 బిల్లియన్ సంవత్సరాలు అని నిర్ధారించారు. ఈలోగా చాల మంది బుర్రలు బద్దలు కొట్టుకొని ఉండి ఉంటారు. సకల జీవ జాలం నించి పరిణితి చెంది అది మానవుడు ఆవిర్భావం ఒక అయిదు నించి ఆరు వేల సంవత్సరాలు క్రితం జరిగి ఉంటుంది అని అన్ని పుస్తకాలలో అచ్చు వేయించారు కొంత మంది పెద్దవాళ్ళు చాన్నాళ్ళ ముందట. పురాణాలూ, బైబిల్ ఇంకా ఇతర చాదస్తాలు అన్నీపక్కకి తోసేసాము అని అన్నారు. నిజమెంతో అని మళ్లీ తర్వాత జరిగే శాస్త్రీయ పరిసోధనాల్లో అనుమానాలు మొదలు అయ్యాయి. రాజ్యం లో ఉన్నవాడు అచ్చువేయించి "నమ్ముతార చస్తారా" అని అన్నప్పుడు, వేరే సిద్ధాంతాల ని హేళన చేసిన నాడు తాత్కాలికం గా అయిన మనుషుల్లో భావోద్వేగాలు వచ్చి ఉండకుండా ఉంటాయా? మీలో ఎవరికీ అయినా భగవంతుడు వేరే మతం వాళ్ళు కొలిచే రూపం లో ప్రత్యక్షం అయ్యి జనావళి కి అంతా "ఒరే మూర్ఖులారా !! మిగతా అన్ని విశ్వాసాలు అన్ని తప్పు. ఈ ఒక్క మతమే నిజం" అని చెప్పాడు అనుకోండి. ఒప్పుకోగల సామర్ధ్యం ఉందా మన అందరిలో ??

Inhibitions అంటే తెలుగు లో ఏంటండి?  "అభ్యంతరము, ఆక్షేపణలు". ఒక్కొక్క కాల మాన పరిస్తితి ని బట్టి మూస గా  వీటి మధ్యలోనే పెరుగుతారు.

యూదులు అంత నిరర్ధకమైన ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. వాళ్ళని నాశనం చీసే తీరాలి  - ప్రపంచం లో ఒక ప్రాంతం అంతా కనీసం ఒక రెండు దశాభ్దాలు పాటు దీన్నే నమ్మింది.

ఆర్యులు, అనార్యులు అనే చీలిక హిందూ దేశాన్ని ఎప్పుడో చీల్చింది - ఉత్తర మరియు దక్షిణ భారతీయులు ఒకే వేదమును నమ్ముతున్నా ఒక జాతి కాదు.

పాకిస్తాన్ అనే దేశం లో ఒక్క మంచి వాడు కూడా పుట్టే/పెరిగే అవకాశమే లేనే లేదు - భారతీయ జాతి అంతా  ఈ సిద్దాంతాన్ని ఇంకా నమ్ముతూనే ఉంది. అలాగే అటువైపు వారు బ్రాహ్మణ భారతీయ సంస్కృతి అత్యంత ప్రమాదకరం. నశింప చేసే హక్కు మా మతం మాకు ఎప్పుడో ఇచ్చింది - ఇది పాకిస్తాన్ దేశ ఉనికి కి ఆయువు పట్టు.


పోనీ ఆధునికులు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రజలు వేరే విధం గా ఆలోచిస్తారు అని అనుకోవడానికి లేదు. సామాన్యమైన పరిస్తితుల్లో తాము విశ్వసించిన వాటిని తప్పేమో అని ఎవరు అయినా బయటికి అంటే దాన్ని దారుణంగా అణిచి వేసిన సంభందాలు ఎన్నో ఎన్నెన్నో !!


ఆశ్చర్యమైన విషయము ఏంటి అంటే మీరు నమ్మిన విషయము ఇంకొక ప్రాంతం లో కాని సమాజము లో కాని కాలమానము లో పూర్తిగా విరుద్దం అని తెలిస్తే సామాన్యంగా మూర్ఖత్వం ప్రబలుతుంది. బహుశా ఒక శకం మారాలి ఏమో పరిస్తితులు మారటానికి.  అందుకే సమాజం లో పెద్ద పీట లో ఉన్న వాళ్ళు ఇలాంటి సున్నితమైన విషయాల్లో బహు జాగ్రత్త వహించే వాళ్ళు. కొన్ని classified files లో భయంకర నిజాలని అత్యంత గోప్యం గా ఉంచడాన్ని నేను అయితే గొప్ప సమాజ సేవ గానే భావిస్తాను. కొంత శాంతి ఏర్పడినప్పుడు తగు జాగ్రత్త వహించి ప్రజ కి ఇవ్వడాన్ని సమర్ధించాలి అనుకొంటా. ఇవ్వాళ్ళ ఆంధ్ర ప్రదేశ్ లో సామాన్యమైన ప్రజలు ఇంత మీడియా అత్యుత్సహమును చూపడాన్ని "దేశ ద్రోహం" గా చాల మంది పరిగణించడం లో తప్పు ఏమీ కనపడ్డం లేదు.


ఈ యొక్క మానసిక అడ్డంకులు ఏ స్తాయి లో అయినా ప్రబల వచ్చు. వీటిని ఏ మనిషి అయినా ఒక జీవిత కాలం లో అధిగమించ వచ్చు లేదా ఆ సంఘర్షణ లోనే సతమతం అవ్వ వచ్చు. మీ యొక్క నమ్మకాలు జీవితాలని ఉద్దరించవచ్చు లేదా మౌడ్యం లోకి నెట్టేయ వచ్చు. కొంత మంది విపరీత ధోరణి, కాల యాపన, వృధా వైరాలు, కార్పణ్యాలు, వ్యగ్రతలు ఇలా ఎన్నో జాడ్యాలకు గురి అవ్వడం చూస్తూ ఉంటాము.

అలాగే ఇంకో తీరు ఏంటంటే, మీరు నమ్మే సిద్ధాంతం తప్పు అని పని కట్టుకు చెప్పడం వల్ల కొంత మందికి చాల సంతృప్తి ని ఇస్తుంది ఏమో. పోనీ శాస్త్ర పరమైన సిద్దాంతి కరణ జరిగిన తర్వాత ఇలాంటి విమర్సాత్మక మైన ధోరణి నప్పుతుందేమో కాని అల్లా  టప్ప గా మాట్లాడే వాళ్ళని సమాజ విద్రోహులు గానే పరిగణించాలి. "నిజం నిలకడ మీద తేలుతుంది" అన్న మాట అక్షర సత్యం కాదా. ఇవ్వాళ్ళ రోజున వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని మాటల గారడీ తో తిమ్మి ని బొమ్మి చేసి ప్రజల మీదకు రుద్దే మహాను భావులని చూసిన తర్వాతే భూమి ని పిచ్చి పిచ్చి గా పరిశోదన చేసి వయస్సు కనిపెట్టే ప్రయత్నం ని మానవాళి అందరు హర్షించ వలసిన విషయమే !!! ఇంకా ఇలాంటి నిజాలు ని మరింత నిజమని చెప్ప్పే ప్రయత్నాలు అన్ని చూసి "చాల రోజులు నించి ఇలాంటివి చూసాను" అని మనమందరూ నిలబడిన భూ దేవి ఎన్ని రోజులు నించి చెపుతోందో తెలియాలి కదా.

Monday, January 31, 2011

మా రైల్వే కాలనీ క్రికెట్ - Rules of Engagement

మా రైల్వే కాలనీ క్రికెట్ 
********************

మొన్న వరల్డ్ కప్ ఫైనల్ లో సరి సమానం గా స్కోర్ అయినప్పుడు , మేధావులు ఏమీ చేయాలో తెలియక తలలు బద్దలు కొట్టుకొని , ఎవడు ఎక్కువ బౌండరీలు కొడితే వాడిని విజేత గా ప్రకటిస్తున్నాం అని చేతులు దులిపేసుకున్నారు, తద్వారా సమస్త ప్రజానీకం చేత అక్షింతలు కూడా వేయించుకున్నారు. ఇవ్వాల్టి రోజున ICC వాళ్ళు వచ్చి వాళ్ళిష్టం వచ్చినట్టు రూల్స్ అన్ని తిరగ రాస్తూ ఉంటే, మా కాలనీ లో మేధావులు ఏనాడో ఉచితంగా చేయగలిగిన దానికి వీళ్ళకి ఇంతేసి డబ్బులు ఎందుకు దండగ అని అనిపించక మానదు. 

మేము మా రైల్వే కాలనీ లో అడినదే అసలు సిసలు క్రికెట్ అండి !! నాకు గుర్తు ఉన్నంత వరకు మచ్చుక్కి కొన్ని మీతో మనవి చేస్తాను.
  1. మాకు ఫీల్డింగ్ చేసే అప్పుడు రెండు పోసిషన్స్ సెట్ అయిపోయి ఉండేవి. ఒకటి వికెట్ కీపెర్, మరొకటి bye వికెట్ కీపెర్. వికెట్ కీపెర్ కి మాములు gloves వేసికొని ఉంటే bye వికెట్ కీపెర్ మాత్రం హవాయి చెప్పులు తగిలించు కొని ఉండేవాడు. వీడు సాధారణముగా టీం లోకల్లా చిన్నవాడు కానీ, కొత్త గా వచ్చిన వాడు కానీ లేదా బాల్ డబ్బులు ఎగ్గొట్టిన వాడు కానీ అయిఉంటాడు.
  2. వికెట్ కీపెర్ మరియు bye వికెట్ కీపెర్ కనక ఒక లైన్ లో నిలబడ్డారు అంటేఅంపైర్ ఆ బంతి ని "నో బాల్" గా డిక్లేర్ చేస్తాడు. అటువంటి మహత్తర క్షణాల్లో ఒక బౌలర్ అతి కష్టం మీద బ్యాట్సమెన్ ని క్లీన్ బౌల్డ్ చేసి నెత్తి నోరు బాదుకొన్నా చేయగలిగింది ఏమీ లేదు.  
  3. బౌలర్ ఎటువైపు నించి ఏ చేత్తో బౌలింగ్ చేయ్యపోతున్నాడో అంపైర్ కి తెలియచెయ్యడాన్ని "గార్డ్"  చెప్పడం అని అంటారు. ఈ నియమం బౌలర్ కనక పాటించ లేదనుకోండి, ఆ బాల్ నో బాల్ అయి కూర్చుటుంది. అయితే తర్వాతి బాల్ కి కూడా చెప్ప లేదు అనుకోండి, అప్పుడు కూడాఅంపైర్ అతని తప్పు చెలియ చెయ్యడు. మళ్లీ ఆ బంతి ని "నో బాల్" గానే ప్రకటిస్తాడు. అప్పుడు కెప్టైన్ కలగ చేసుకొంటే "మీ వాడికి గార్డ్ చెప్పాలని ముందు చెప్పమ్మా" అంటూ గీరగా సమాధానం చెప్తాడు.
  4. సాధారణంగా లెగ్ అంపైర్  బాటింగ్ టీం నించి ఉంటాడు. ఒక్కొక సారి ఈ లెగ్అంపైర్ మారే కార్యక్రమం లో బాటింగ్ టీం వాళ్ళు తగిన సమయం లో వాడిని పంపడం మర్చి పోతారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఫీల్డింగ్ టీం వాళ్ళు బంతి తీసుకు వచ్చి స్టంప్స్ ని పడగొడతారు. ఇప్పుడు ఫీల్డింగ్ టీం వాళ్ళు బాట్స్మన్ లేదా రన్నర్ లలో ఎవరో ఒకరిని అవుట్ చెయ్యవచ్చు. పాపం అవుట్ అయిన వాడు టీం కెప్టైన్ ని ఏమి బూతులతో సత్కరిస్తాడో మీకు మళ్లీ చెప్పక్కర లేదు అనుకొంటా.
  5. ఇదే రూల్ లెగ్అంపైర్ బాట్స్మన్ కి లెగ్ సైడ్ కాకుండా ఆఫ్ సైడ్ లో ఉన్నాడు అనుకోండి అప్పుడు కూడా  ఫీల్డింగ్ టీం వాళ్ళు గుంట నక్కల్లాగా వచ్చి బాట్స్మన్ ని నిర్ధాక్షిణ్యం గా అవుట్ చేసేస్తారు. ఇదే విధానానికి బలైన లెఫ్ట్ హ్యాండ్ బాట్స్మన్ పాపం ఎందరో !!
  6. అవుట్ అయిన బాట్స్మన్ బౌండరీ లైన్ ని దాటినా తర్వాత కాని నెక్స్ట్ బాట్స్మన్ లోపలి వచ్చాడు అనుకోండి అప్పుడు అతను ఒక్క బాల్ కూడా ఆడకుండా స్టంప్ అవుట్ చేయ వచ్చు.
  7. చాల సందర్భాల్లో బాటింగ్ ఆర్డర్ కోసం ప్రొఫెషనల్ టీమ్స్ తెగ కష్ట పడుతుంటారు. మా కాలనీ లో అది చాల ఈజీ. ఎవడు బాల్ కోసం ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడు ఓపెనింగ్ బాట్స్మన్, తర్వాతే ఎవడైనా !!
ఏంటి ఇవన్ని అభూత కల్పనలు అని అనుకొంటున్నారా ? మా జీవితాలు మిలిటరీ కమాండ్స్ గా నిలిచిన రూల్స్ ఇవి. నాకు గుర్తు  ఉన్నంత వరకు మీతో షేర్ చేసుకొన్నాను. మీకు కూడా ఇంకా మిగిలి ఉన్న రూల్స్ షేర్ చేస్తే, అందరం కలిసి ఒక గ్రంధం తయారు చేద్దాం.  

జై హింద్ !!

Wednesday, January 26, 2011

గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్ - చదవడం ఆపాలంటే

  1. ముఫై రోజులు పాటు విడిచి పెట్ట కుండ చదవండి.
  2. ఇండియా లో మీ బందువులని, స్నేహితులని ఒక పదిమంది ని "ఈ వెబ్ సైట్ తెలుసా" అని అడగండి.
  3. ఈ వెబ్ సైట్ లో వ్రాసే రివ్యూ లు చదివి సినిమాలు చూడడమో లేదా చూడక పోవడమో చెయ్యండి.
  4. మీ బాత్ రూం లలో వైర్ లెస్స్ సిగ్నల్ ని జాం చెయ్యండి
  5. డేటా ప్లాన్ ఉన్న సెల్ ఫోన్ ని పొద్దున్నే కనపడకుండా జాగ్రత్త పడండి.
  6. చదివిన చెత్త ని ఇండియా లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి "నిజమా" అని అడగండి.
  7. వారానికి ఒక్కటి అయినా మంచి తెలుగు కధ చదవండి.
  8. ఈ సైట్ వలన వచ్చిన కంప్యూటర్ వైరస్ బాదితులతో తరుచు మాట్లాడుతూ ఉండండి

Monday, January 17, 2011

Multi Tasking

చెట్టు లెక్క గలవా ఓ నరహరి !! పుట్టలెక్కగలవా ఓ నరహరి చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా !! ఓ నరహరి చిగురు కోయగలవా ?
అంటూ చెంచు లక్ష్మి రూపం లో అంజలి దేవి పలు పలు విధములైన పరీక్షలు మన నాగేశ్వర రావు కి పెట్టి న విధము చూసి ఆ రోజుల్లో అమ్మో ఇంత కటినమా అని అనుకొన్నారట. మరి ఇవ్వాల్టి రేపు చెట్టులు, పుట్టలు మరియు పర్వతాలు, లోయలు ఇలా అనితర సాధ్యం కాని రక రకాల విన్యాసాలు అన్ని ఏక కాలం లో చేస్తేనే అది అసలు సిసలైన సామర్ధ్యం !!


"పొద్దున్నే లేచి యోగాచేస్తాను అండి"
"అబ్బా !! ఎంత సేపు చేస్తారు అండి?"
"కనీసం ఒక అర్ధ గంట. అప్పుడే iphone లో సాంగ్స్, టీవీ లో morning news కూడా లాగిన్చేస్తాను అండి. మళ్ళ నైట్ జాబ్స్ ఉంటాయి కదండీ, వర్క్ కి కూడా connect అవుతాం"
"ఓపిక సార్. ఇంత హడావుడి లో యోగా చేస్తున్నారు"

"మనది అంతా express సార్ !! కార్ లో వెళ్ళే టప్పుడు బ్రేక్ ఫాస్ట్, లంచ్ normal గా working lunch, రాత్రి తినేటప్పుడు ఈనాడు, జ్యోతి కవర్ అయిపోతుంది. లేదా ఇండియా కాల్స్ ఉంటాయి కదా"
"మనం ఈ మధ్య iphone లో గేమ్ లాగించేస్తున్నాము. ఒక చెయ్యి ఖాళి కదా మరి"

"సార్ !! ఇది ఒక పెద్ద addiction అయి పోయింది సార్. ప్రతి రెండు నిమిషాలికి ఒక సారి email చెక్ చేసుకోకుండా ఉండ లేక పోతున్నాను సార్."
"కరెక్ట్ అండి !! నేను అయితే ఒక రోజూ మర్చి పొయ్యాను ఇంటి దగ్గర. పిచ్చి ఎక్కి పోయిందంటే నమ్మండి"

"మా వాడు సోమ వారం kumon, మంగళ వారం కరాటే, బుధ మళ్లీ kumon and సంగీతం, గురు డాన్సు, శుక్ర వారం టెన్నిస్, శని వారం మళ్లీ డాన్సు. అది వారమే గ్యాప్ వచ్చింది అండీ"
"మంచి పని చేస్తున్నారు అండీ. పిల్లలు ఎన్ని అయినా చేస్తారు అండి. మన బాధ్యత అన్ని నేర్పాలి ఎందుకు అంటే ఇప్పుడు అన్ని అవసరమే కదా"

"2 నిముషాలు పాటు ఒకే పని చేయడం ఎలా"
"ఒక మనిషితోనే పది నిముషాలు మాట్లాడం ఎలా"
"కార్లో ఒక్క డ్రైవింగ్ మాత్రమే చేయడం సాధ్యమా"
"ఇంటర్నెట్ చూడ కుండా టీవీ చూడగలమా"
"ఇంటర్నెట్ లేకుండా ఒక చిన్న పేరా వ్రాయడం ఎలా"


అలయక సొలయక వేసట, నొలయక కరి మకరి తోడ నుద్ధం డత రా
త్రులు సంధ్యలు దివసంబులు, సలిపెం బో రొక్క వేయి సంవత్సరముల్

అమ్మో పోతనామాత్య !! ఆ రోజుల్లో కుదిరింది కాని, ఇప్పుడు అయితే వెయ్యి సంవత్సరాలు పాటు ఎన్ని తెలుగు సినిమాలు చూసేసివి అనుకొంటున్నారు ఏనుగు మరియు మొసలి కొట్టుకుంటూనే ? లెక్కలేనన్ని iphone apps డౌన్లోడ్ చేసేసి పిచ్చ టైం పాస్ చేసు కోనేవి.

పెద్దవాళ్ళు చెపుతారు, "వేళ పట్టున కడుపు నిండా ప్రశాంతంగా తిండి తినరా" అని. టైం ఎక్కడ ఉందండీ ?? కనీసం మిగతా ప్రాణులు ప్రకృతి సహజమైన దైనందిక కార్య క్రమాలు అయినా హాయిగా ప్రశాంతంగా కానిస్తాయి. మన ప్రారబ్ధం, ఆ అదృష్టం కూడా కోల్పోతాము వయస్సు పెరిగే కొద్ది.

మనసా వాచా కర్మణ త్రికరణ సుద్దిగా చేసే ప్రార్ధన కు దేవతలు కూడా వశం అవుతారు అట. మనకి అయన వచ్హినా మధ్యలో email కానీ ఫోన్ కానీ వస్తే మనసు పెట్టి మాట్లాడడానికి టైం ఏది ??

Monday, January 10, 2011

దేశం - నా కళ్ళతో

  1. దేశం చలి కన్నా ధర్నాలు, బంద్ లు, దీక్షలు గురించి ఎక్కువగా వణుకుతోంది.
  2. విజయవాడ సరిహద్దుల్లో ఉన్న థెర్మల్ విద్యుత్ ప్లాంట్ ఇంకా "నార్ల తాతారావు" గారి పేరు మీదే ఉంది. ఇంకా ఎవరి కంటా పడినట్టు లేదు.
  3. "ఆరంజ్" సిన్మా లో నటించిన వాళ్ళ పేర్లు కంటే పోస్టర్ సమర్పించిన వాళ్ళ పేర్లు బాగా పెద్దగా కనపడుతున్నాయి. విజయవాడ లో సిన్మా పోస్టర్స్ సమర్పించడానికి కూడా చాల పోటీ ఉన్నట్టు ఉంది.
  4. బస్సుల్లో, ట్రైన్స్ లో జనాలు ఇదివరకు లో లాగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడం బదులు సెల్ ఫోన్ సంగీతం మత్తు లో తేలియాడుతున్నారు. హెడ్ ఫోన్స్ షేర్ కాన్సెప్ట్ చాల బావుంది.
  5. షాపింగ్ మాల్స్ లోపలి వెళ్ళే మగ వాళ్లకి సెక్యూరిటీ చెక్ తప్పదు. ఆడ వాళ్ళు బాంబులు తీసుకెళ్ళినా అడిగే వాడు లేడు
  6. చంద్ర బాబు ఆ మధ్య దేశం లో మరుగు దొడ్లు లేక పోయినా జనం బతుకు తారు కాని, సెల్ ఫోన్ లో లేకుండా ఒక్క క్షణం కూడా ఉండ లేరు అన్నది అక్షర సత్యం. తుమ్మిన వెంటనే ఎవరికీ అయినా చెప్పకుండా ఉండలేక పోతున్నారు.
  7. అమెరికా నించి ఎవరు అయిన కనపడితే, మీరు నికృష్టం మైన జీవితం గడుపు తున్నారు అని చాల మంది పని కట్టుకు చెప్పడం ఈ మధ్య ఆనవాయితి అయినట్టుంది.
  8. దేశం లోని తొంబై శాతం వనరులు జనాభా లోని ఐదు నిండి పది శాతం ధనికులు వాడుతున్నారు. ఇంకా మంచి నీరు కూడా లేని ప్రజలు కో కొల్లలు.
  9. హైదరాబాద్ లో ఇళ్లన్నీ ఇంద్ర భవనంలు - రోడ్లు అన్ని నరక కూపాలు
  10. కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రి వర్గ కూటమి ఎర్పడినాడు విజయవాడ నగరం అంతా నిద్ర హారాలు మని పేపర్లతోనే సంభాశించింది.
  11. ప్రజలు అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే క్రమంలో ఇరవైనాలుగు గంటలు హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ వింటూనే ఉన్నారు.
  12. దేశంలో "భక్తీ", "టి టి డి" చానల్స్ పుణ్యమా అని పదమూడు, పన్నెండు శతభ్డాలు లో జరిగినట్టు "భక్తీ" ఉద్యమం జరుగుతున్నది.
  13. పెళ్లి శుభ లేఖలలో "పెద్దలు నిర్ణయించిన సుముహూర్తం గాన విచ్చేసి వధూ వరులను ఆశీర్వచ వలసినది" అనే బదులుగా "రిసెప్షన్ కి వచ్చి మా విందు (ఒక్కొక్క ప్లేటు ఎన్ని రూపాయలో కూడా చెప్పవచ్చు) ఆరగించి, ట్రాఫ్ఫిక్ ఇబ్బందులు కాన త్వరగా వెళ్ళిపొండి" అని కూడా అచ్చు వెయ వచ్చు.
  14. ప్రవాసాంధ్రులు అంటే విపరీతమైన సానుభూతి పెరిగింది.