Thursday, December 29, 2022

Chapter 11 - Telugu

ఏకాదశ అధ్యాయస్య తెలుగు వ్యాఖ్యానం దశమధ్యాయమునందు అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మా యొక్క సకల విభూతినలు గూర్చి తెల్సినవాడై అమిత తన్మయత్వము అనుభవించెను. తన ముందు తిరిగాడుతున్న కృష్ణుడు కేవల తన ఇష్ట సఖుడు మరియు బంధువు మాత్రమే కాదని, అతను సర్వవిశ్వాసార్వభౌముడని, సకలైశ్వర్యములు ప్రభువని గమనించి అంజలి ఘటిస్తూ కృష్ణుడిని "కమల పత్రాక్ష" అని సంబోధించాడు. కమలమువంటి కన్నులు గలవాడా అన్న కీర్తన అత్యంత విశేషణమైనదిగా పేర్కొనబడినది. రామాయణ కావ్యములో సుందర కాండలో, రామ మహాభక్తుడైన ఆంజనేయుడు, తనను తాను "రామ దూత" గా అభివర్ణించుకొన్నప్పుడు, సీతా మహా సాధ్వి రాముని చారిత్రం మరియు ఆయనను ఈ విధముగా ఆంజనేయుడు దర్శించాడో వివరించమని కోరుతుంది రామః కమలపత్రాక్ష సర్వ భూత మనోహరః రూప దాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజా అంటూ ఆంజనేయుడు రాముణ్ణి శ్లాఘిస్తాడు. ఈ విశేషణం కేవలం విష్ణుస్వరూపమైన మహాపురుషలకే సంబంధించినదని మనకి ఇక్క అవగతం అవుతున్నది. అర్జునుడు కృష్ణుని దివ్యవిభూతుల మహత్యం గురించి తెలిసికొన్న వాడై అయన విశ్వరూపసందర్శనం కొరకై ఆకాంక్ష వ్యక్త పరుస్తాడు. కానీ ఆ యొక్క కోరికను అత్యంత వినయసంపన్నుడై తనకు అర్హత ఉందని పరమాత్మ భావిస్తేనే ఆ భాగ్యం ప్రసాదించమని ప్రాధేయపడతాడు. మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో । యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ।। 4 ।। ఈ సందర్భములో కృష్ణుని పట్ల అర్జునుని భక్తి భావమునందు గల స్వల్ప వ్యత్యాసం మనం గమనించ వచ్చు. పదవ అధ్యాయమందలి పదిహేడవ శ్లోకములో కృషుడిని "యోగీ" అని సంభోదించగా ఇచట "యోగీశ్వరా" అని పిలుస్తున్నాడు. అనగా, పరమ యోగులకు కృష్ణుని ఈశ్వరునిగా అర్జునుడు గుర్తుఎరిగి వ్యవహరిస్తున్నట్టుగా మనం గమనించ వచ్ఛు. మనయొక్క అర్హతార్హతలు నిర్ణయించునది ఎవరు? గీతాగ్రంథము లోని అయిదవ అధ్యాయములో పేర్కొన్నట్టు, "విద్యా వినయతే సంపన్న". మన ప్రయత్నము ఎంత బృహత్కరమైనప్పటికిన్నీ అందులో వినయం లోపించిన యెడల భగవంతుని సంపూర్ణ కృపా కటాక్షములు తప్పని సరిగా మనకు లభించవు. ఇతిహాసమునందు ఎన్నో మంది రాక్షసీ మరియు అసురీ ప్రవుత్తిచిత్తులైన వారు అమరత్వ ప్రాప్తినకై ఘోర తపస్సులను చేసిన వారే. కానీ భగవంతుడు వారి అహంకార చిత్తము గమనించిన వాడై, వారి కోర్కెలను తగు పరివర్తనం గావించి వర ప్రధానమును చేయుట మనకి తెలిసిన విషయమే. ఇందున మనకు ప్రస్ఫుటఉదాహరణాలు హిరణ్య కశిపుడు, రావణా శురుడు ఇత్యాదులు. కానీ అదే సమయములో విభీషణుడు తన తపస్సు ఫలితముగా తనకు "సదా ధర్మమార్గాచరణ జీవన" వరము ప్రసాదించమని అడగగా, అతనికి "చిరంజీవత్వం" అనుగ్రహించాడు. తొమ్మిదవ శ్లోకము మొదలు పదునాల్గవ శ్లోకము పర్యంతము, భగవానుని అమోఘమైన విశ్వరూప వర్ణనం సంజయుడు గావిస్తాడు. భగవంతుని విశ్వరూపనగా అది ఎట్టిది ? విశ్వమంతటి నందు ఆ భగవద్ స్వరూపము సందర్శించడమనేనా ? అర్జనుడు ఆ యొక్క బ్రహ్మాన్డ రూపమునందు అసంఖ్యాకములైన ముఖములు, కన్నులు, ఆయుధములు, ఆభరణములు ఇత్యాదులు దర్శించగలిగెను. ఆ రూపము అనేకమైన దివ్య మాలలు ధరించి సుగంధములను అనులేపనము గావించి దేదీప్యమానముగా విరాజిల్లుతుండెను. అనంతములైన సూర్యుల కాంతి కన్నను ఆయన యొక్క తేజము హెచ్చిల్లుతూ ఉండెను. ఈ దివ్యరూప వర్ణనము సంజయుడు ఎవని తో చేయుచుండెను ? ధృతరాష్ట్రుని తోనే గదా ? ధృతరాష్టునికి కృష్ణుని దివ్యమహిమలు నూతన విషయములు గావు గదా ? కౌరవ పాండవుల సంధి ప్రయత్న సందర్భములో శాంతి దూత విచ్ఛేసిన శ్రీ కృష్ణుడు, ఆ గుడ్డి రాజు తన మహిమల ప్రభావములను గుర్తెరెగి అయినను జననష్టదాయకమైన యుద్ధము ను విరమిస్తాడేమోనన్న భావనతో అతనికి తన యొక్క విశ్వరూప సందర్శన భాగ్యము ను ప్రశాదించెను. ఇంతటి పరమోతృకృష్టమైన దివ్య దర్శనం గావించినను ఆ కౌరవ రాజు యుద్దమునకే ఎందువలన మొగ్గు చూపెను ? కృష్ణుడు ధర్మ పక్షపాతి కదా, తదునుగుణంగా ఆయన యొక్క విశేష కరుణ పాండవుల పట్ల ఉన్నదని తెల్సి కూడా కౌరవులు ఈ ఆత్మహత్యాసాదృశ్యకమైన ఈ యుద్ధమునకు దుస్సాహసించెను ? ఈ సర్వ జగత్ పరమాత్మ యొక్క లీలా మయా వినోదనమునకు వర్తించుచున్నదన్న విషయం మనకు అవగతమవవలెను కదా ? భాగవత కథా సందర్భమునందు కూడా శ్రీ కృష్ణుడు యశోదా మాతనకు ఈ సకల విశ్వము తనయందే నిండి ఉందన్న సత్యము ఆవిష్కరింప చేసెను గదా ? కానీ ఆమె ఆ సర్వేశ్వరుని మాయా మోహమునకు లొంగినదై తదుపరి క్షణము నిండి కృష్ణుని తన యొక్క గారాల పట్టి అనే వ్యవహరించెను కదా ? ఈ మాయనుండి విముక్తి పరమయోగీశ్వరులకు కూడా అసాధ్యము అయిన యెడల సామాన్యులకు ఏమి సాధనం, ఆ పరమేశ్వరుని సంపూర్ణ శరణాగతి తప్ప ? భగవంతుని విశ్వరూపమును దర్శించిన అర్జునుడు ఆనందతన్మయత్వం తో ఆ రూపము ను కీర్తించ సాగెను. ఆ భగవంతుని అనంత బాహువులు, పాదములు సర్వత్ర వ్యాప్తి చెంది ఉండెనట. ఇదే మాదిరి ఆ లీలామానుష రూపమును పురుష సూక్తము కూడా వర్ణిస్తున్నది. స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః । స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ । స భూమిం॑-విఀ॒శ్వతో॑ వృ॒త్వా । అత్య॑తిష్ఠద్దశాంగు॒లమ్ ॥ అర్జునుడు ఆ స్వామిని కీర్తిస్తూ, ఈ సర్వ జగత్తు నీ యొక్క కనుసన్నలనలోనే చరిస్తున్నది. కఠోపనిషత్తు నందు పేర్కొన్నట్టు భయాదస్యాగ్నిస్తపతి భయాత్ తపతి సూర్యః భయాద్ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః సకల దేవతలు నీ యందు మిక్కిలి భయావర్తులై తమ తమ కర్తవ్యములను ఆచరిస్తున్నారు. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని । కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ఈ యొక్క భయానక రూపమును చూచిన వీరాధివీరుడు, విజయనామధేయుడైన అర్జునుడు భయకంపితుడై కుపితుడై ఉన్నాడు. సృష్టి స్థితి లయకారకుడు ఆ భగవానుడే. ఇచట అర్జునుడు స్వామీ యొక్క లయకారక స్వరూపమును దర్శించు చున్నాడు. ఆయనచే తన యొక్క సకల బంధుజనములు, మిత్రులు గ్రసించబడుచున్నారు. అర్జునుడు మిగిలిన పాండవులతో పోలిస్తే కృష్ణుని తో మిక్కిలి సమయం గడిపి ఉన్నాడు. కృష్ణ సోదరి అయినా సుభద్ర ను పరిణయమాడి అతనితో బంధుత్వం కూడా సంపాదించు కొన్నాడు. అయన తనకు సముడనే భావన తోనే తన యొక్క రథసారధ్య భాద్యతను కూడా కృషునికి ఇవ్వ అంగీకరించాడు. అయితే ఇప్పుడుకృష్ణుని పట్ల అతనికి ప్రేమ భావన బదులుగా భీతి భావన కలగసాగింది. భగవంతుని సాకార రూపము చూసిన పిమ్మట భీతి భావన కలిగిన మరొక సందర్భం దుష్టసంహారణ కొరకై వెలిసిన నృసింహ అవతార మప్పుడు. ఆ సమయమునందు సమస్త దేవకోటి భయభ్రాంతులై ఆయన రూపమును ఉపసంహరింపమని మరల ప్రహ్లాదుడినే వేడుకొన్నారు ఈ యొక్క మహోతృకృష్టమైన స్వరూపం ని చూసిన అర్జునుడు భయాక్రాంతుడై ఆ భగవంతుని హేతువు మరియు ప్రవృత్తి లను తెలియసుకొనగోరాడు. హే అర్జునా - ఈ సకల విశ్వము, ఘటనలు, ప్రసిద్ధ జనులు, సంస్కృతులు, భాషా స్వరూపములు అన్నియూ కాలగర్భమునందు కలియవలసినవే. భగవానుడే ఆ కాల పురుషుడు. నీవు ఒక నిమిత్తునవి మాత్రమే. ఈ ప్రతిపక్ష సైన్య హతమునకు నీ ప్రమేయాప్రమేయములు అనవసరము. ఈ సృష్టిలోని సకల దేవతా దర్శనము అర్జునుడు ఆ యొక్క విశ్వరూపమునందే గాంచెను. ఆయన ఈ యొక్క సృష్టి కార్యనిర్వహణార్థముకొరకై ఈ దేవతల నియోజించెను. ఇంతటి మహాత్ముని యెడల అర్జునుడు తన యొక్క సఖుడని తలంచి అజ్ఞానంతో చేసిన తప్పిదాలను గుర్తు తెఛ్చి కొని ఆటను పశ్చాత్తాపము చెంద సాగెను. ఈ సందర్భములో మనకు సుపరిచితమైన వెంకటేశ్వర స్త్రోత్ర ము లోని ఈ పంక్తులు జ్ఞాపకము రాక మానవు కదా అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే । క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥ హే స్వామీ - నా యందు అపార కృపా కటాక్షములతో నీ యొక్క అమోఘమైన విశ్వరూపము ను నాకు చూపినావు. కానీ నీ యొక్క భయానక స్వరూపము నేను చూడలేకున్నాను. నా యందు దయవుంచి, నీ శాంతాకారమును మరల స్వీకరించు, అని ప్రార్ధించెను. ఈ అధ్యాయము చివరలో భగవానుడు మన అందరి యందు అమిత ప్రేమా వాత్యలాలతో "ఎవరైతే నా యందు నిష్ఠ తో నిరంతరం నన్ను సేవింతురో, సర్వ ప్రాణిల యందు ద్వేషరహితులై ఉండెదరో వారు మాత్రమే నన్ను చెర గలుగు తారు " అని సందేశం ను ఇ చ్ఛేను

Thursday, June 25, 2020

Father's Day

మునపటికి చాన్నాళ్ల క్రితం సత్య లోకంలో  మన బ్రహ్మ గారు  ఒక రోజు కొలువై ఉన్నప్పుడు  సరస్వతీ దేవి వీణ శృతి సరి చేసుకొంటూ, "రోజూ ఈయన గారి వాహనం హంసధ్వని రాగాలాపనేనా, కొంచం వెరైటీ గా ఉంటుంది, కదనకుతూహలం ట్రై చేద్దాం" అనుకొంది.  అమ్మవారి ఈ మానససంచలనానికి రవ్వంత ఉలిక్కిపడిన బ్రహ్మ గారు, ఎందుకొచ్చిన గొడవలే అనుకోని, తన సృష్టి కార్యక్రమంలో భాగంగా, చేసినవన్నీ సత్కర్మలే అయినా, కొద్దిగా ఋషి ఋణం బకాయిపడిన సంధర్భంవల్ల, ఒక జీవిని భూలోకం పంపే ప్రయత్నంలో పడ్డారు. వాడు ఉన్నవాడు ఉండక, "స్వామి, ఇంత కాలం హాయిగా సత్య లోకంలో వేళకి తింటూ పడుకొంటూ, అమ్మ వీణాగానశ్రవణం చేస్తూ మీఇరువురి సంరక్షణలో ఇలా కాలం వెళ్ళబుస్తున్నాను. అసలే ఇప్పడు కరోనా అనే మహమ్మారి మరియు దాని మిత్రగణాలు పలు వేరియంట్ రూపధారులై స్వైర విహారం చేస్తున్న సమయం లో ఇప్పుడు భూలోకం పంపించడం ఏమైనా న్యాయంగా ఉందా", అంటూ దీనవదనంతో అడిగిన ఆ జీవికి, బ్రహ్మ ఇలా సెలవిచ్చాడు. "చూడు నాయనా, దేవుడు అన్నిచోట్లా ఉండడం సాధ్యం కాదనే, అమ్మ ని సృష్టించాడు. ఆ అమ్మ సంరక్షణలో, నీవు నిశ్చింత గా భూలోకంలో కాలం వెళ్ళబుచ్చవచ్చు", అని ఆ మధ్య  మదర్స్ డే సందర్భంగా విష్ణుమూర్తి పంపిన వాట్సాప్ మెసెజ్  గుర్తు తెచ్చుకొని చెప్పాడు. ఈ దెబ్బతో, సరస్వతి దేవి కూడా ట్యూన్ మార్చి మళ్ళీ హంసధ్వని రాగం ఆలాపన మొదలయ్యేటప్పటికీ కొంచం మనస్సు కుదుట పడింది. అయితే, ఈ సన్నివేశం అంతా ప్రత్యక్షం గా చూసిన నారదుడు చాలా సంతుష్టుడై, వైకుంఠానికి నారాయణ నామస్మరణ చేసికొంటూ, "అయ్యా ! మాతృమూర్తి వైభవం గురించి బ్రహ్మ పలికిన పలుకులు మీతో మనవి చేస్తానని", కధా వృత్తాంతం అంతా వివరించాడు. ఇది అంతా సావధానంగా విన్న విష్ణుమూర్తి, "బావుందోయ్ నారదా !! మరి అయితే అదే బ్రహ్మ గారిని తల్లి దైవమైతే, తండ్రుల పరిస్థితి ఏంటని కనుక్కురా", అని ప్రేరేపించాడు". నారదుడు తిరుగుటపా లో మరల సత్య లోకానికి వచ్చి బ్రహ్మ దేవుడికి ఈ ప్రశ్నని విన్నవించాడు. "ఈ విష్ణుమూర్తి ఎదో ఒక పితలాటకం పెట్టకుండా మానడు కదా" అని మనస్సు లో అనుకొంటూ, "ఇదిగో అబ్బాయ్, నారదా !! నీకు ఒక నెలరోజులు సెలవ ఇస్తున్నాను. నీవు భూ లోకం వెళ్లి అన్ని దేశాలు తిరిగి అస్సలు ఈ తండ్రులు ఏమీ వెలగపెడుతున్నారో కాస్త కనుక్కొని రా" అని పురమాయించి, విష్ణుమూర్తి విసిరిన బౌన్సర్ నించి లాఘవంగా అప్పటికి తప్పించుకున్నాడు. "అలాగే, ఈ సారి భూలోకంలోకి వెళ్లి నప్పుడు, మాస్కులు, గ్లోవ్స్ శానిటైజర్స్ వగైరాలు దగ్గర పెట్టుకోవడం మరవద్దు నాయనా ", అంటూ హెచ్చరిక కూడా చేసి తిరిగి తన సృష్టి కార్యక్రమం లో నిమగ్నం అయ్యాడు

నెల పైన ఒక వారం గడిచేసరికి తిరిగేసరికి, తిరిగి సత్య లోకానికి చేరిన నారదుడు, "తండ్రీ !! మీరేమో అంతా తిరిగి పరిస్తుతులు గమనించమన్నారు, కానీ ఈ తండ్రుల చేసే పనుల జాబితా  అంతా సేకరించేపాటికి, కొంచం ఆలస్యం అయ్యింది,  క్షంతవ్యుడిని" అంటూ తాను ఏకరువు పెట్టడం మొదలుపెట్టాడు.
  • అయ్యా, మహానుభావా !! భూలోకంలో తండ్రులు అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇళ్ళు తుడవడం ఇత్యాది విద్యల్లో మునపటి కన్నా చాలా ప్రతిభావంతులయ్యారు. అంతే కాక, వారు తమ ఈ ప్రావీణ్యాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా నిత్యం అప్రమత్తులై ఉండగలడం విశేషం. 
  • భూలోకం లో, ఇటీవల కాలంలో "మదర్స్ డే" అన్న ఒక సంబరం ఒకటి చేస్తున్నారు. దాని కోసరం, ఈ తండ్రి వర్గం అందరూ అహర్నిశలూ శ్రమించి, వారి వారి కుటుంబ సభ్యులందరి చేతా మాతృమూర్తలందరిని తమ తమ స్థాయికి మించి సత్కరిస్తున్నారు. మరి కొంత మంది ఔత్సాహికులయితే, తమ భార్యామణులకు ఆ రోజు పూర్తిగా విశ్రాంతి నిచ్చి కాలు కూడా కింద పెట్టనియ్యకుండా అన్నీ దగ్గరవుండీ చూసుకొంటూ ఆనంద తన్మయలు అవ్వడం గమనించాను. అదే విధము గా భూలోకం లో "ఫాథర్స్ డే" అన్న మరో ఒక సంబరం కూడా జరుపుకొంటారు అట. కానీ ఇది మదర్స్డే కి  బిన్నంగా, తండ్రి అని పిలవబడే వ్యక్తే, ఆ తారీకును గుర్తు ఉంచుకొని, బజార్లో గ్రీటింగ్ కార్డు అది కూడా సేల్ లో ఉన్నది ఒకటి కొని, పిల్లల చేత దస్తకత్తులు చేయించుకొని అదే చూసుకొంటూ మురిసిపోవడం గమనించాను 
  •  ఇక నూతన వస్త్ర ధారణ విషయానికి వస్తే, తనకున్న బట్టల్లో కొంచం కొత్తగా కనపడే చొక్కా ఒకటి బయటకి తీసి, బాగా ఇస్త్రీ చేసి తన పిల్లల చేత ఇప్పించుకొని ఒక రెండు ఫోటోలు తీయించుకొని వాట్సాప్ లలో షేర్ చేసికొని మళ్ళీ ఆ చొక్కాని నలగకుండా తన అల్మారా లో జాగ్రత్త గా పెట్టుకోవడం నేను ప్రస్ఫుటం గా గమనించాను 
  • పిల్లల భవిష్యత్తు కోసరం నిద్రాహారాలు మాని, స్కూలు, కాలేజీలంటూ తమ కుటుంబ సంపాదనని పైసా పైసా పోగేసి, వెనకేసి, మొత్తానికి తన పిల్లలని తన శక్తిమేరకు ప్రయోజకులు అయ్యారన్న సంతృప్తి తో కొంచం విశ్రాంతి తీసికొందామని అనుకొంటూ ఉండగానే, "అమ్మా ! నేనింత వాడిని అయ్యానంటే, అది అంతా నీ గొప్పతనమే అమ్మా" అంటూ తన పిల్లలు అర్ద్రోక్తి గా ఫోన్లో పలికిన పలుకులు కర్ణాకర్ణి గా వినపడడం చాలా సాధారణం గా నేను గమనించాను
*****************************************************************************
అందరికి  "ఫాథర్స్ డే" శుభాకాంక్షలు. కొంచం సరదాగా రాసుకున్న పై మాటలని మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను. 

"మాతృ దెవొ భవ ! పితృ దేవో భవ ! ఆచార్య దేవో భవ ! అతిధి దేవో భవ !" అన్నది మన సనాతన ధర్మానికి పునాదిగా నిలిచిన వేదోక్తి. మన సంప్రదాయంలో పితృస్థానానికి ఇచ్చిన గౌరవం మహోతృష్టమైనది. త్రేతాయుగామందడి శ్రీ రామచంద్రుడు పితృ వాక్య పరిపాలనా యజ్ఞమునకు ఎంత తాపత్రయ పడ్డాడో జగమెరిగిన సత్యం. వరం పుచ్చుకొన్న కైక, మాతృమూర్తి కౌసల్య ఇత్యాదులకు ధర్మ సూక్ష్మమును వివరించి తన కర్తవ్యపాలన నిర్వర్వర్తించాడు. మరో అవతార పురుషుడైన జమదగ్ని సుతుండు పరశురాముడు తన తండ్రి మాటని ఏ విధంగా జవదాటలేదో మనందరికీ విదితమే.

తండ్రి నిత్యం నిస్వార్ధంగా ఫలాపేక్షరహితం గా పిల్లల అభ్యున్నతిని కోరుకొనే వాడు. సంప్రదాయం ఏదైనప్పటికీ ఈ ఆదివారం తండ్రి స్థానంలో నిలిచిన ఆ దేవతా స్వరూపాన్ని తలిచి సంతోషిద్దాం 

**************HAPPY FATHERS DAY TO ALL****************

Thursday, March 26, 2020

విష్ణు సహస్ర నామ ఆవిర్భావం

విష్ణు సహస్ర నామ ఆవిర్భావం

సాధారణంగా, మన సంప్రదాయాల్లో మానవ శ్రేయస్సు కోసం ఏర్పరచబడిన ఏ పూజలు, స్త్రోత్రాలు ఇతరత్రా బహుశా ఋషిప్రోక్తం లేదా స్వయానా భగవంతుని నించి అందించబడినవి. కొన్ని ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల సంభాషణల నించి గ్రహించబడ్డవి. ఇదే విష్ణుసహస్ర నామ పారాయణ ఫలశృతి భాగంగా

కేనో పాయేన లఘన విష్ణోర్నామ సహస్రకం 
పట్యతే  పండితైర్నిత్యం శ్రోత మిచ్యామ్యాహం ప్రభో !!

వీళ్ళని రోజూ సహస్ర నామాల, స్త్రోత్రాలు అంటూ బెదర కొట్టకండీ మరీను, ఏదో ఒక ఉపాయం చెప్పండీ అనగా, "సర్లే" మరి, కనీశం రామ నామ జపం చెయ్యమను, సరి పోతుంది అని మనకి పరిష్కారం సూచిస్తాడు ఆ పరమాత్మ.


శ్రీ రామ రామేతి రమే రామే మనో రమే 
సహస్ర నామ తత్తుల్యం రామ నమ వరాననే 

వేదాలు సరేసరి. అవి అపౌరుషేయాలు. సృష్టికి ముందే ఈ సృష్టికి మూలమైన స్థితి కారక శక్తి ద్వారా మనకి అందించబడ్డాయని మనం విశ్వసిస్తున్నాము. కొన్ని ఇతిహాశాంతర్గతంగా మనకి అందించబడ్డాయి. ఉదాహరణకి, రామాయణ ఇతిహాసం ద్వారా మనకి సుందరకాండ పారాయణ, ఆదిత్యహృదయం ఇత్యాదివి మానవ శ్రేయస్సు నిమిత్తం నిక్షిప్తమైనాయి. లేదా మానవాళి నిమయామావళిని నిర్దేశించే భగవద్గీత మహాభారతంర్గతమైనదే. మరికొన్ని, మనం వ్రతాల్లో, పూజల్లో "సౌనకాది ముని సంవాదే" అని ప్రస్తావించబడడం కూడా తరచూ గమనిస్తూ ఉంటాం.  అయితే విష్ణుసహస్రనామాలకి మాత్రం ఒక విశిష్టత ఉంది. ఇది భగవంతుని సమక్షంలో, అయన ఆజ్ఞా ఆదేశలమేరకు మేరకు ఒక భక్తుడు ఇంకో భక్తుడికి ఉపదేశించబడినది. 

అయితే ఇక్కడ ఈ సంఘటనని మనం కొంచం విస్తారంగా ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇంత గొడవెందుకు, కృష్ణుడే స్వయానా ఇది భగవద్గీత లాగానే ఆయనే ఎవరోఒకరిని ఎంచుకొని ఉపదేశం చేస్తే పోయేది కదా అని. అయన ప్రత్యక్షంగా నిలబడి భీష్ముడి చేత స్త్రోత్రం చేయించుకోవడం ఎందుకు? ఇవన్నీ మనకి బాగా అర్ధం అవ్వాలి అంటే, మనకి కృష్ణుడి అవతారం, దాని యొక్క మూల ఉద్దేశ్యం బాగా అవగతం అవ్వాలి. 

కృష్ణావతారం మిగతా అవతారాలకంటే చాలా భిన్నమైనది. ఉదాహరణకి రామావతారంలో శ్రీరామచంద్రుడు, కేవలం మానవుడి గానే పూర్తిగా వ్యవహరించాడు. అయన తనకేదో దైవాంశ, అద్భుత శక్తులు ఉన్నట్టు ఎక్కడా కనపడదు. రావణ సంహారం తర్వాత దేవతలు ప్రత్యక్షమై ఆయన్ని విష్ణుమూర్తి అవతారమని స్తుతిస్తూ ఉంటే, "అహం రామస్య దశరధ పుత్రాణాం" అనే సమాధానమిస్తాడు. అయితే కృష్ణుడు అలా కాదు. తన అవతార ఆవిర్భావం, సమాప్తం అంతా అయన అధీనమే అని స్పష్టంగా తెలియపరుస్తాడు. మనం సినిమాల్లో చూసుంటాం. చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే, ఒక బోయవాడు అయన కాలి యొక్క బొటన వేలిని చూసి లేడి కన్ను అని బ్రాంతి చెంది బాణం వేస్తే అవతారం చాలించి వైకుంటానికి చేరుకొన్నాడు అట. ఇది పూర్తిగా అసంబద్దంగాను, నమ్మశఖ్యముగా ఉండదు. పూర్తి గా కృష్ణావతారం లో అనేక మైన చిత్ర విచిత్ర విన్యాసాలు చేసిన అయన కాలి బొటన వేలుకి బాణం గుచ్చుకొంటేనే ప్రాణం పోతుంది అంటే ఎంత అసంబద్దంగా ఉందండీ ? అసలు ఎవరికీ అయినా కాలికి దెబ్బ తగిలితే మహా అయితే సెప్టిక్ అవుతుందేమో కాని ప్రాణం పోతుందా ?విశ్లేషనికి వస్తే పరమాత్మ యొక్క సాధ్యసాధ్యలని ఎంచడం వంటి పనులు చేయతగడం చేయరాదని సందేశం ఏమో ?  అయన మానవ జన్మ తీసుకోవడం ఎంత అసాధారణమైన విషయమో అదే విధంగా ముగింపు కూడా పూర్తిగా అయన అధీనంలో ఉన్నదే అని మన అందరికి చెప్పే ఉదేశ్యమో అని అనిపించక మానదు.

అయితే కృష్ణుడు తన అవతారం మొత్తం తాను వచ్చిన ప్రయోజనం నెరవేర్చే దాని కోసరం చాలా బాధ్యత పడ్డాడు.  తన చిన్నతనంనించే భగవద్గీత సారాంశం ఉపదేశించాలని అన్వేషణ మొదలుపెట్టాడు. అయితే వినేవాళ్ళకి గురి కుదరాలంటే తానెవరో తెలియడం ముక్ష్యం. కృష్ణలీలల పేరిట మహిమలు ప్రదర్శించాడు. అయినా, నందనవనంలో అయన అంటే మూఢ భక్తి పెరిగిందే తప్ప వేదోపనిషత్తుల సారాంశమైన విజ్ఞానం అందుకొనే పరిపక్వత అగుపించలేదు. ఇకపొతే ఆ కాలంలో ప్రాచుర్యంలో లో రాజగణం ఆయన్ని అహంకారంతో ఒక సామాన్య యాదవుడు గానే చూసింది.

మహాభారతం లో మొట్టమొదట కృష్ణుడు పాండవులని కలవడం ద్రౌపది స్వయంవరంలో. అయన పెద్ద దాపరికాలు లేకుండా, బ్రాహ్మణ వేషంలో ఉన్న ధర్మరాజుని "మీరు ఎన్ని కష్టాలు పడ్డరయ్యా ! పాపం లక్క ఇళ్ల తగాలాపడినప్పుడు నానా అవస్థలు పడి తప్పించుకొన్నారటగా. తర్వాత ఏకశిలా నగరం లో యయావరం చేసికోవాల్సి వచ్చిందికదా" అంటూ ఎటువంటి మొహమాటం పడకుండా పరామర్శిస్తాడు. ధర్మరాజు మొదట ఆశ్చర్యపడినా, కృష్ణుడి తన తమ్ములతో సహా దైవాంశ పురుషుడిగానే గుర్తించి ,దర్శించి శరణాగతి చేస్తాడు. అయితే భక్తుడికి పరీక్షలు తప్పవు. ఒక సందర్భంలో పాండవులు మొదట సారి జూదం ఆడి రాజ్యం ఓడి, వలువలు ఒలుచుకొంటున్న సతి ని  నిస్సహంగా నించొని చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి లో ఉంటే, "గోవిందా" అన్న పలుకుకే పరవశించిన పరమాత్మ పరుగున వచ్చి తన చెల్లలి మానం కాపాడుకొన్నాడు. కానీ అదే పాండవులు మళ్లీ తన పెదనాన్న జూదానికి పిలిస్తే వెళ్లి పన్నెండు సంవత్సరాల వనవాసం, ఇంకొక సంవత్సర అజ్ఞాత వాసం కొసరు కొని తెచ్చు కొన్నప్పుడు ఈయన ఆ దరిదాపు లో కనపడడు. తర్వాత ఎప్పుడో తీరిగ్గా పాండవుల ని అరణ్యంలో కల్సి, "అయ్యో !! మీకెంత కష్టం వచ్చింది. అసలు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. నేను శిశు పాలుని తమ్ముడు ని చంపే నిమిత్తం వాడిని వెతికి వెతికి పట్టుకొని చంపే క్రమంలో ఆరు నెలలు పాటు అరణ్యంలో గడపాల్సి వచ్చింది." అంటూ నిస్సంకోచంగా అబద్దం ఆడతాడు అట. శిశుపాలుడిని చంపడానికి కేవలం మానస సంకల్పంతోనే సుధర్సానాన్నిసృజించినాయనికి, అతని తమ్ముడిని చంపడానికి ఆరు నెలలు పట్టిందా ? ఇది అందరు ఎలా నమ్మ గలిగారు ? కాని ధర్మరాజు కానీ తక్కిన పాండవులు కాని ఆయన్ని ఆ ప్రశ్నే వేయలేదు. బహుశా, అయన "ఏమయ్యా !! మీకు జూదం కి వెళ్దామా వద్దా అని గాని, ఓడిన తర్వాత గాని, అరణ్య వాసం సంప్రాప్తించిన తర్వాత కాని నేను గుర్తుకు రాలేదా" అన్న అర్ధం గోచరించింది ఏమో !! మాట్లాడక ఊరు కోడం తప్ప ఏమి చేయలేక పోయారు. శరణాగతి చేసిన వాళ్ళని కాపాడే నిమిత్తం ఎటువంటి దేశ కాల సమయాలలో అయినా సరే నేను ముందర ఉండి ఏదోవిధంగా చక్రం అడ్డు వేస్తా అన్న పెద్ద మనిషి, "నేను" చూసుకొంటానులే అనుకొన్నప్పుడు అంత చక్కగాను దాటు వేయగల సమర్ధత ఉందని మన అందరికి సందేశం ఏమో !!

అయన భక్తుని ఆర్తికి మురిసిపోయాడు. "అయినను పోయి రావలయు హస్తినకు" అంటూ రాయబారానికి సిద్దమయితే, "మీరు వెళ్తారా ? మీరే వెళ్తారా ? నాకు కుటిలాత్ములైన కౌరవులమధ్యకు మీరు వెళ్లడం నాకు ఎంత సుతరామూ ఇష్టం లేదు" అని దిగులు పెట్టుకొన్న ధర్మరాజు ప్రేమ కు లొంగి పోయాడు. అలాగే ఆర్త రక్షణ కోసరమై, ఆడిన మాటని కూడా తప్పాడు. "ఆయుధం పట్టను" అన్న పెద్ద మనిషి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి "కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగా"  తీరున బీష్మునిపై ఎగసిన సన్నివేశం భక్తా వేశా  పరాకాష్ట. తనతో సాన్నిహిత్యం చేసి అరివీర పరాక్రమ వంతుడు, ధీరుడు అయిన అర్జునికి, తాను అవతారమంతా ఎదురుచూసిన మానవ శ్రేయస్సు, మనుగడ కోసరం నిర్దేశించ బడిన సందేశం భగవద్గీత రూపం లో అందించాడు. అయితే ఇంత విజ్ఞానం అంధింపపడిన తర్వాత కూడా, అభిమన్యుని మరణం తర్వాత నిర్వీర్యమైన అర్జునిని చూసి చాల నిరుత్సాహ పడ్డాడు. నీవు భగవంతుని మీద భారం వేసి కర్తవ్య దీక్ష నిర్వర్థించమనీ చిలక్కి చెప్పినట్టు చెప్పినా కూడా, కరుణ్ణి నిర్జించడానికి ధర్మా ధర్మాల తర్కం చేస్తున్న అర్జునిని చూసి ఆశ్యర్యపడ్డాడు. అయితే ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావించుకోవాలి

సహజం గా మనం పాటించే ధర్మం మీద మన అందరికి రాగం మరియు నచ్చని దాని మీద ద్వేషం కలగడం చాల సందర్భాల్లో చూస్తూ ఉంటాము.అయితే ఇక్కడ ధర్మ పరిశీలన చేయడం అందరికి సాధ్యమా? ఎందుకు అంటే మనలాంటి వాళ్లకి స్వతహా గా అత్యంత ఇష్టం అయిన పని "తప్పోప్పుల నిర్ధారణ" మరియు తీర్పు. పక్కవాడిని ధర్మ బ్రష్టుడు అని వెలి వేయడం లేదా పరమ ధర్మాత్ముడు అని భజన చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే ధర్మం దేశ కాల పరిస్తితుల బట్టి మారుతూ ఉండచ్చు. లేదా మనకి కనిపించే ధర్మం అధర్మం అయ్యి ఉండవచ్చు.   చాల తక్కువ సందర్భాలో అందరికి ఆమోద యోగ్యమైన ధర్మాచరణ బయటకి కూడా ధర్మంగానే కనిపిస్తుంది. యుద్ధం చేయడానికి వచ్చిన అర్జునుడు అది మానేసి తర్కం చేయడం చూసి విచారపడ్డాడు. బహుశా మానవాళి, వేదసారమైన భగవద్గీత వంటి గ్రంధసారాంశం గ్రహించడానికి సిద్ధంగా లేదేమో అని సంశయ పడ్డాడు.

మహాభారతయుద్ధం అనంతరం జరిగిన బంధుజన ప్రాణ నష్టం ని కళ్లారా చూసిన ధర్మరాజు  తీవ్ర మనః వైక్లబ్యము చెందుతాడు. యుధిష్టరుడు, అజాత శత్రువు, ధర్మానికి ప్రతీకగా కొనియాడబడ్డ అంతటి ధర్మరాజు విషాద యోగానికి గురికాబడతాడు. స్వస్తిర ధర్మ రాజ్య పాలన జరపడాలన్న కాంక్షతో శ్రీ కృష్ణుడు ధర్మరాజు ని అంపశయ్య మీద స్వచ్ఛంద మరణం కోసరమై ఎదురుచూస్తున్న భీష్ముడి దగ్గరకి తీసికెళ్ళతాడు. "సర్వజగత్తునకు మూలకారణము, అనాదిమధ్యలయుడు, సమస్త జగములు నీలోనే లీనమైన ఉన్నవాడివి కృష్ణా, నీకు తెలియని ధర్మములు నేను ధర్మజునికి ఎలా బోధించగలనని" భీష్ముడు కృష్ణుడి అడగగా, "ఒక భక్తుడికి భగవంతుని పట్ల  ఆర్తి, ప్రేమ ఆ భక్తుని ద్వారానే తెలపబడాలని" విష్ణుసహస్ర నామ ఆవిష్కరణకి ఆదేశిస్తాడు.

కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం 
స్తువంతః కామ్ కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభం 
కోధర్మః సర్వధర్మాణం భవతః పరమో మతః 
కింజపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార భందనాత్ 

సమస్త సృష్టిలోకెల్లా సర్వ శక్తిమంతుడైన భగవంతుడెవ్వడు ? ఎవరి శరణాగతి మనం కోరవలెను? ఎవరిని ప్రార్ధించంవల్ల మానవాళి కి శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయి? అన్నిటి కన్నా ఈ ధర్మం గొప్పది ? ఎటువంటి జపం చేయడం వల్ల, ఈ చావు పుట్టుకల సంసార బంధనాల నించి విముక్తి కలుగుతుంది... అంటూ ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా, సమస్త జగత్తునకు విష్ణు సహస్ర నామావళి, భీష్ముని ద్వారా అందించ బడింది

Thursday, January 30, 2020

దైవం మానుష్య రూపేణా

దైవం మానుష్య రూపేణా 

*********************************************************************************
నేను అమెరికా మొదటిసారి వస్తున్నప్పుడు, పక్కన కూర్చున్న ఒక వయస్సు మళ్ళిన సిక్కు వ్యక్తి మాటలు కలుపుతూ, "ఎన్నాళ్ళు కోసం ఈ దేశానికీ వస్తున్నావని" అడిగాడు. "రెండు ఏళ్ళకి మించి ఒక్క రోజు కూడా ఉండబోనని" చెప్పినప్పుడు నా యొక్క దృఢ సంకల్పాన్ని లెక్క చేయకుండా తన గుబురు గడ్డం చాటునుండి పక్కున నవ్వాడు.  సరేలే. దారిన పోయే దానయ్య ఈయనతో నాకెందుకని నా మానాన నేను ఉండిపోయాను. జీవితం కొంచం ఎక్కువగా చదివేడో ఏమి పాడో, నా విషయమేమి కర్మ, నాలాంటి కొన్ని వేల, లక్షల మంది ఆ రెండు సంవత్సరాలు ఎప్పుడు అవుతాయా అనుకొంటూనే శేష జీవితం గడిపేస్తున్నాము.

అయితే, ఇక్కడి ప్రవాసులుకు అన్నిటికన్నా దుర్లభమైన అనుభవం ఏంటంటే, అకస్మాత్తుగా తన వారిని స్వదేశంలో శాశ్వతంగా కోల్పోవడం. విషయం తెల్సిన వెంటనే, చుట్టూ ఉన్న స్నేహితులు పెట్టె సర్ది, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి, విమానాశ్రయం వరకు వచ్చి దిగపెట్టడం వంటివి చక చక జరిగి పోతాయి. కాకపోతే 24 గంటలు పాటు, ఈ బాధని ద్రిగమింగుతూ ప్రయాణం చేయడం, కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఎట్లా చేయగలగడం అన్న విషయం ఆలోచిస్తేనే చాల కష్టం గా అనిపిస్తుంది. నా ఒక మిత్రుడు, తన తండ్రి కోల్పోయి ఇదే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, "అస్సలు ఈ అబ్బాయి ఇండియా వరకు క్షేమంగా వేళ్ళగలడా" అని చాల భయపడ్డాను. అతను, న్యూయార్క్ లో ఇండియా విమానం ఎక్కే వరకు సమాచారం అందింది కానీ, మిగతా విషయాలు అన్నీ మళ్ళీ అతను తిరిగి ఒక నెల తర్వాత వచ్చే వరకు తెలియలేదు. 
న్యూయార్క్ లో ఎయిర్ పోర్ట్ నా పాటికి ఒక మూల కూర్చొని ఉంటె, ఎక్కడ నిండి వచ్చాడో తెలియదు ఒక పాకిస్తానీ ముస్లిం వ్యక్తి వచ్చి నా పక్కనే కూర్చొని, "ఆప్ బడే దుఃఖే లగ్ రహే హై" అంటూ మాట కలిపేడు, అంటూ నా మిత్రుడు తనకు జరిగిన విచిత్రమైన అనుభవాన్ని  నాతో పంచుకున్నాడు. చనిపోయిన తన తండ్రి వయస్సు ఉన్న ఆ పాకిస్తానీ వ్యక్తి, ప్రయాణం మొత్తం, ఈ అబ్బాయిని సముదాయిస్తూ, దారి పొడుగూతా తనకు సాధ్యమైనంత స్వాంతన కలిగిస్తూ, దుబాయ్ చేరిన తర్వాత లాహోర్ వెళ్లాల్సిన తన విమానం లో వెళ్లాడని చెప్పుకొచ్చాడు, నా మిత్రుడు. ఆయనతో మాట్లాడుతుంటే అచ్చం మా నాన్న తో మాట్లాడినట్టు ఉందంటే నమ్మవు నివ్వు.. బహుశా "దైవం మనుష్య  రూపేణా" అంటే ఇదేనేమో. "ఆ భగవంతుడే అయన రూపంలో వచ్చేడని అనిపించిందంటే నమ్ము సత్యా..."
*********************************************************************************
అమ్మా!! రాజా రాజేశ్వరీ !! చాల కష్టాలు పడ్డాము తల్లీ !! ఎట్లా అయినా మా ఆయనకి ఈ ఇంటర్వ్యూ గట్టెక్కే మార్గం చూపించు తల్లీ, అంటూ తనకి చినప్పటినించీ చిర పరిచితురాలాయన ఏకైక దైవం, ఆ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మకి త్రికరణ సిద్ది గా నమస్కరించింది, శ్రావణి. దాదాపు 40 ఏళ్ల క్రిందటి మాట. మెకానికల్ ఇంజనీర్ బ్యాక్ గ్రౌండ్ తన భర్త కి, అమెరికా లో చదువు అయిన తర్వాత మొదటి ఉద్యోగ ప్రయత్నం, కొంచం కష్ట తరమైందనే చెప్పాలి. ఇండియా లో చిన్న పల్లెటూరు నించి వచ్చిన శ్రావణికి ఎటువైపు చూసినా తనకి మాట సాయం చేసే వాళ్ళు ఎవరూ కనపడడం లేదు. ఊసుపోక, పక్కెనే ఉన్న లైబ్రరీకి చేరి, అన్య మనస్కంగా అక్కడ పడిఉన్న మ్యాగజిన్ లు తిరుగావెయ్యడం చూసి, కొద్దో గొప్పో పరిచయం ఉన్న లైబ్రేరియన్ మేరీ, " వాట్స్ రాంగ్ శ్రావణి ?? ఈస్ ఎవరీ థింగ్ ఆల్రైట్??", అంటూ అడిగింది. ఈవిడ కెందుకొచ్చిన గొడవ అనుకొంటూ, తన ఆయనకి లోకల్ కంపెనీ లో రేపే ఇంటర్వ్యూ ఉందనీ, ఎవరైనా మెకానికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళ రిఫరెన్స్ ఉంటే బావుంటుందని అనుకొంటున్నాని చెప్పింది.  "రియల్లీ.. లెట్ మీ సి ఇఫ్ పాల్  కాన్ హెల్ప్ యు.." అని తన ఫోన్ నెంబర్ మరియు అడ్రస్ తీసికోంది మేరీ.
ఈవిడ ఎప్పటికి కుదిరి, ఆ పాల్ అన్న ఆయనికి చెప్పాలి అనుకొంటూ, నెమ్మదిగా తన అపార్టుమెంట్ కి చేరింది. తనకి చిన్నప్పటినించి చేత అయిన, దుర్గ, లక్ష్మి అష్టోత్తర నామావళి మననం చేసికొంటూ ఉండగానే, ఒక గంట తర్వాత ఇంటి ముందర డోర్ బెల్ మోగింది. ఎవరా అనుకొంటూ తలుపు తీయగానే, ఒక క్రిస్టియన్ పాస్టర్ తెల్ల గౌన్ వేసికొని, "I believe you are thinking of me" అంటూ నవ్వుతూ అడిగాడు. ఈయన గురుంచి నేను ఆలోచించేదేమిటని అనుకొంటూ అసలు సంగతి ఆరా తీస్తే, ఈయన్ని లైబ్రేరియన్ మేరీ పంపించందని మరియు ఈయన పాస్టర్ అవ్వక ముందర తన అయనకి ఎక్కడైతే ఇంటర్వ్యూ ఉందొ అక్కడే ఒక పెద్ద మెకానికల్ ఇంజనీర్ గా పని చేసాడని తెల్సింది. అయన, తన భర్త resume తీసికోవడం, అందులో తగిన చేంజెస్ చేయడం, రిఫరెన్స్ ఇవ్వడం తర్వాత ఉద్యోగం లో చేరడం చక చక జరిగి పోయాయి.
బహుశా "దైవం మనుష్య  రూపేణా" అంటే ఇదేనేమో. "ఆ భగవంతుడే పాల్ రూపంలో వచ్చేడని అనిపించిందంటే నమ్ము సత్యా..."
*********************************************************************************
"స్వామి నాథన్ గారు అనడం అయితే అన్నారు గాని.. అదేమన్నా సాధారణమైన విషయమా.. మనలాంటి వాళ్ళు పని అయితే చేస్తాము కానీ గుడి కట్టడం అంటే మామూలు విషయమా", ఒక శనివారం వాలంటీర్స్ కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ నించి  డ్రైవ్ చేస్తూ మనోజ్ తన పక్కనున్న స్నేహితుడి తో అన్నాడు.

"ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు" అన్న సామెత ఒకప్పటి సంగతేమో. ఇవ్వాళ రేపు, ఈ రెండూ కొద్దో గొప్పో డబ్బు ఉన్న వాడికి, లోన్స్ ఇత్యాది వంటివి జోడించుకొంటే ఎక్కడైనా సుసాధ్యాలే.. అయితే అమెరికాలో కొన్ని చిన్న ప్రదేశాల్లో సంకల్ప బలం ఎంత గొప్పదైనా కూడా గుడి కట్టడం అన్న విషయం చాలా సందర్భాల్లో, "భగీరథ" ప్రయత్నమే అవుతుంది.

"చూద్దాము బాసు... నివ్వు అన్నట్టు ఇది అంత ఈజీ పని కాదు" అనుకొంటూ  తమ ఇళ్ళకి వెళ్లారు. "ఇంతింతై వటుడింతై" అన్నట్టు, శంకు స్థాపన, భూమి పూజ, నిధుల సేకరణ ఇత్యాది పనులు చక చక సాగి పోయాయి. మొదటి నించి గుడి పనుల్లో చురుగ్గా ఉన్న మనోజ్ అదే సంవత్సరం, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సంవత్సరం మూడు నాలుగు సార్లు ఇండియా ప్రయాణం పడటంతో,  గుడి కోసం తాను విరాళంగా ఇద్దామనుకొన్న డబ్బు ఇట్టే ఖర్చు అవ్వడం కూడా జరిగి పోయింది.

"మనోజ్.. మా కంపెనీ లో ఒక స్పెషల్ ప్రాజెక్ట్ వర్క్ ఒకటి వచ్చిందోయ్. కానీ ఆ  skill set ఇవ్వాళ రేపు దొరకడం చాల కష్టం. దాదాపు 20 ఏళ్ల క్రితం అందరూ వదిలేసిన వర్క్. నీకు ఎవడైనా తెలిసిన వాళ్ళుంటే చెపుతావా" అంటూ తన పరిచయస్తుడు ఒకడు ఎదో మాటల సందర్భంలో అన్నాడు. వివరాలు కనుక్కొంటే, తాను ఎప్పుడో చెన్నై లో పని చేసినప్పటి ప్రాజెక్ట్ లాంటిదే అవడం వల్ల ఆ పని చేయడం పెద్ద కష్టం అవ్వలేదు. అమ్మవారి గుడి కి తాను మొదట ఎంత విరాళం ఇద్దామనుకొన్నాడో సరిగ్గా అదే మొత్తం ఈ ప్రాజెక్ట్ లో సహాయ పడ్డం ద్వారా మనోజ్ కి ముట్టింది.

బహుశా "దైవం మనుష్య  రూపేణా" అంటే ఇదేనేమో. "ఆ అమ్మవారే  అతని రూపంలో వచ్చి తన పని చేయించు కొందేమో సత్యా..."
*********************************************************************************
తమిళ్ బ్రాహ్మిణ్ అబ్బాయి కష్టం లో ఉంటే పాకిస్తానీ ముస్లిం వ్యక్తి వచ్చి మాట సాయం చేయడం యాదృచ్చికమా లేదా ఆ భగవంతుడికి సరిగ్గా ప్రాబ్లెమ్ అర్ధం అవ్వలేదంటారా?

దుర్గమ్మ ని పూజిస్తే క్రిస్టియన్ పాస్టర్ ప్రత్యక్షం అవ్వడం ఏంటండీ!! దేవుడి కంప్యూటర్ లో వైరస్ ఏమైనా ఉందంటారా?

అమ్మవారి గుడికి కంప్యూటర్ ప్రాజెక్ట్ కి కనెక్షన్ ఏంటో మరి.. లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక...
*********************************************************************************



Wednesday, February 27, 2019

సినిమా ప్రయోగాలు


నలుగురు తెలుగు వాళ్ళు కలిశారంటే మామూలుగా మాట్లాడుకొనే టాపిక్ "సినిమా". మనకి చూడ్డం కన్నా విశ్లేషణ మీదే ఆసక్తి ఎక్కువ అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదన్న నా అభిప్రాయాన్ని మీరు అంగీకరిస్తారు అనుకొంటా. విళంబి నామ సంవత్సరంలో మన తెలుగు సినిమా రంగం లో కొన్ని జరిగిన కొన్ని ప్రయోగాలని స్పృశిద్దామని ఒక చిన్న ప్రయత్నం, ఈ శీర్షిక !!

రంగస్థలం: మన సినిమాల్లో మామూలుగా హీరో అసాధ్యమైనది అంటూ ఏమీ ఉండదు. అయన చాల చురుగ్గా ఆలోచించ కలడు, వందల కొద్దీ కండలు తిరిగిన మగ ధీరులును ఒక్క చిటికన వేలుతో మట్టి కరిపించ గలడు, అయన శక్తి సామర్ధ్యాలు అత్యంత నిపుణులు అయిన వైద్యులు కూడా ఒక అంతు పట్టని చిదంబర రహస్యం అనే మూస నైపధ్యం లో కొన సాగుతున్న సగటు ప్రేక్షకులకు, కొంచం విన్నూత్నంగా వినికిడి శక్తి లేని ఒక పల్లెటూరి యువకుడు కూడా ఈ పాత్ర పోషించవచ్చు అని చేసిన ఈ ప్రయత్నం నిజంగా హర్షించ దగినదే !! గోదావరి జిల్లా మాండలీకంలో సాగిన ఈ 1980 దశాబ్దంలోని గ్రామీణ సంఘర్షణ కధా చిత్రం కొంత కొత్తగా వైవిధ్యంగా అనిపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదనుకొంటా !! ముక్ష్యంగా మిగతా విషయాలు ఎలా ఉన్నా, గోదావరి యాస అందులోని ప్రత్యేకతలని ఈ చిత్ర కధా నిర్మాణం లో ఈ దర్శకుడు చాల నేర్పు గా వాడుకొన్నాడని నా వరకు కలిగిన అభిప్రాయం

మహానటి: మన తెలుగు చిత్ర పరిశ్రమ లో గత కొన్నీ సంవత్సరములగా "ఇక్కడ అన్నీకృత్తిమంగా తయారుచేయబడగలవు" అనే టాగ్ లైన్ తో నడుస్తున్న తరుణంలో, "సహజత్వం" అనే పదాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ తెర మీద కొన్ని తరాల ప్రేక్షలకులను మంత్రం ముగ్దులను చేసిన "మహా నటి" సావిత్రి తెర వెనుకాల జీవితాన్ని మరల అందరికి పరిచయం చేసిన అత్యంత అద్భుతమైన ప్రయత్నమే ఈ చిత్రం. హిందీ చలన చిత్ర పరిశ్రమ లో ఈ "బయోపిక్" ఒరవడి కొనసాగుతున్నాకానీ, తెలుగులో ఈ మొదటి ప్రయత్నం కొంచం సాహసోపేతమే అని చెప్పవచ్చు. ఎందు చేతనంటే మన తెలుగు చిత్ర ప్రేక్షకుల అంచనాలు చాల భిన్నంగా ఉంటాయి. ఒక రెండున్నర గంటలు పాటు ఒక వ్యక్తి యొక్క కథ చెప్పడంలో చాల నేర్పు, నైపుణ్యం కూడిన ప్రయాస. మహానటి సావిత్రి జీవనం అందులో ఉద్దాన పతనాలు, ఎదుర్కొన్న ఒడిదిడుకులు, మానవీయ సంబంధాలు ఇత్యాది నైపద్యాలు నా ఉద్దేశ్యంలో అత్యంత నైపుణ్యంగా తెర కెక్కించారని నా అభిప్రాయం.

C/O కంచరపాలెం: నాలుగు ఉప నదుల ప్రవాహం, మలుపులు, మజిలీలు కోనసాగుతూనె చివరికి ఒకే చోట చేరడం, ఒక అత్యద్భుతమైన ప్రయత్నం.  ఎప్పుడైతే ఒక సగటు ప్రేక్షకుడు సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ కధ గురించి ఆలోచిస్తాడో, ఆ చిత్ర దర్శకుడి ప్రయత్నంలో పూర్తిగా కృతకృత్యుడు అయ్యాడనే మనం భావించ వచ్చు. ఈ సినిమా లో ప్రత్యేకం ఏంటంటే, ఒక నాలుగు ప్రేమ కధలు తాలూకు పాత్రలు ప్రేక్షకుని మనసు పూర్తిగా కట్టివేయగా, చివర ఈ నాలుగు మార్గాల కూడలి ఒకటే అంటూ ముగింపు పూర్తిగా అనూహ్యం. సాధారణంగా మన తెలుగు సినిమాలు ఈ మధ్య కొంచం వైవిద్యం కూడిన కథనైపథ్యం తో ఉంటే, అవి దిగుబడి ఉత్పత్తులు అవుతున్నాయి. కాగా, ఈ చిత్రం చిన్నదైనా పూర్తి సహజత్వాన్ని ఆపాదించుకోవడం అభినందనీయం.

2018 లో చాల మంచి సినిమాలు విడుదల అయ్యి అవి మన అందరి మనస్సులు చూరకొన్న మాట వాస్తవమే అయినా, విన్నూత్నంగా జరిగిన మొదటి ప్రయత్నాలనే ఇక్కడ స్పృశించబడినవి. 

వాజపేయి

సంస్కృతం లో "వాజపేయి" అనగా వేదములు నిర్వచించిన మహా యజ్ఞాలను జరిపిన వాడు అని అర్ధం. ఇటీవల పరమ పదించిన అటల్ బిహారీ వాజపేయి గారు ఏ విధం గా సార్ధక నామధేయులు అయ్యారో మనం ఇక్కడ మననం చేసికొనే ప్రయత్నం చేద్దాం

  • వాజపేయి  తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వాటిని జాతి ప్రయోజనాలకు సదా దోహద పడే యజ్ఞం తన జీవితం యావత్తు 93 సంవత్సరాల పాటు చేశారు
  • శత్రువు వెన్ను పోటు పొడిచినా చెదరక సైనిక స్థయిర్యాన్ని ప్రోత్సహిస్తూ కార్గిల్ విజయ పోరాట యజ్ఞాన్ని ముందుండి నడిపించారు
  • దీర్ఘ కాల ప్రయోజనాలు దృష్టి లో ఉంచుకొని ప్రపంచానికి ఎదురొడ్డి భారత దేశం పరమాణు శక్తి గా నిలిపే క్రమం లో మహోత్కృష్టమైన యజ్ఞాన్ని నిర్వహించారు
  • "వసుదైక కుటుంబం" భారత దేశం ప్రతిపాదించిన  సిద్ధాంతం అని ఐక్య రాజ్య సమితి లో చాటించి సౌభ్రాతుత్వ యజ్ఞాన్ని రాజకీయాలకి అతీతంగా నిర్వహించారు
  • 1971 యుద్ధం లో చారిత్రాత్మక విజయం సాధించిన ప్రధాని ఇందిరా గాంధీ ని "దుర్గ" గా అభివర్ణించి రాజకీయ అతీత నైతిక యజ్ఞం నిర్వహించారు 
  • సరిహద్దు లకు హద్దులు చాటుతూ మొదటి సారి ఢిల్లీ నించి లాహోర్ కి బస్సు ఏర్పాటు ద్వారా ప్రయత్న లోపం లేని శాంతి యజ్ఞాన్ని చేశారు 
  • 13 విభేద భావ జాల పార్టీలను ఏకత్రాటి పై నడిపి సమైక్య యజ్ఞాన్ని అయిదు సంవత్సరాలు పాటు నడిపించారు
  • రాజకీయ వేత్త, హాస్య చతురత, కవి, సమయస్ఫూర్తి, అంకిత భావం, సిద్ధాంత ప్రమాణ వ్యక్తిత్వం ఇలా తన జీవితం అంతా బహుముఖ ప్రజ్ఞ యజ్ఞాన్ని నిరాటంకంగా నిర్వహించారు
ఈ విధంగా అటల్ బిహారీ వాజపేయి తన జీవనాన్నిదేశ ప్రయోజన యజ్ఞంలో పూర్ణాహుతి గావించారని అనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు

సీతా రామ దాంపత్యం


మరికొద్ది రోజుల్లో మనమందరం శ్రీ రామ నవమి జరుపుకోబోతున్నాము. ఆ సందర్భంగా ఇక్కడ "సీతా రామ కళ్యాణం" గురించి కొంచం వివరణ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పండగ భారత దేశంలో మారు మూల గ్రామాలలో వివిధ పద్ధతులు ఆచారాలకు అనుగుణంగా జరప బడుతున్నది. ఎప్పుడో త్రేతా యుగం లో జరిగిన సీతా రాముల కల్యాణం ఇంకా ఎందుకని చేస్తున్నాం అన్న తర్కాలోచన లేని రోజుల్లో పండగ గుర్తులు ఏవయ్యా అంటే రేడియో లో విన్న భద్రాచలం లో కళ్యాణ ప్రత్యక్ష ప్రసారం, గుళ్ళో మిరియాలు వేసినా తియ్యగానే ఉండే పానకం !! ఒక్క సారి అసలు త్రేతా యుగం అనేది ఎప్పుడు హిందూ కాల  మానం ప్రకారం ఎప్పుడు అయ్యింది అని ఆలోచిస్తే, సీతా రామ కళ్యాణం రమారమి ఒక 2.6 మిలియన్ సంవత్సరాలు జరిగి ఉండచ్చు అన్న నిజం తెలిస్తే మనమందరం ఆశ్చర్య చకితులు అవకమానము. అయితే ఇన్నీ సంవత్సరాల తర్వాత కూడా మనము ఈ సీత రామ కల్యాణ వైభయాన్ని ఇంత ఘనంగా ఎందుకు జరుపుకొంటున్నామో, ఈ సందర్భంగా మానవాళికి ఇవ్వబడిన సందేశం ఏంటి, ఇది కేవలం పండగేనా లేక మన జీవన విధానాలను సన్మార్గములో మార్చుకోగలిగిన అపురూపమైన అవకాశమా.. పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 

జగత్తులో అందరి కంటే ముందరి వారు, అన్నింటింకి మూలా దారం ఎవరయ్యా అంటే, "ఆ అది దంపతులు శివ పార్వతులు" మనకి స్పురణకి వస్తారు. అమ్మ వారికి, అయ్య వారికి మధ్య దాపరికాలు ఉండవు. హెచ్చు తగ్గులకు అసలే తావు లేదు. మనకి అందిన పురాణాలు, వాంగ్మయాలు, వ్రతాలు, వ్రత  కల్పాలు అన్నీ, అమ్మ తన పిల్లల మీద దయతో, ఆదరంతో అయ్య ని అడుగుతుంది, అయన చెప్పడం జరగ బడుతుంది. ఆ కరుణ ని అవధులు, పరిమితులు ఉండవు. ఉదాహరణకి, మనమందరం ఉద్దరింప బడ డానికి, "విష్ణు" సహస్ర నామ పారాయణం ఉదహరింప బడితే, అమ్మ వెంటనే,

కేనో పాయేన లఘన విష్ణోర్నామ సహస్రకం 
పట్యకే పండితైర్నిత్యం శ్రోత మిచ్యామ్యాహం ప్రభో !!

వీళ్ళని రోజూ సహస్ర నామాల, స్త్రోత్రాలు అంటూ బెదర కొట్టకండీ మరీను, ఏదో ఒక ఉపాయం చెప్పండీ అనగా, "సర్లే" మరి, కనీశం రామ నామ జపం చెయ్యమను, సరి పోతుంది అని మనకి పరిష్కారం సూచిస్తాడు ఆ పరమాత్మ.

శ్రీ రామ రామేతి రమే రామే మనో రమే 
సహస్ర నామ తత్తుల్యం రామ నమ వరాననే 

సీత రాములు మన అందరి లాగానే సామాన్యమైన మానవులాగానే దాంపత్య వైభవము గురించి అవతరించిన దంపతులు. మన అందరి లాగానే వాళ్ళు కూడా సుఖ దుఃఖాలు, కోప తాపాలు వంటి సామాన్యమైన అనుభూతులు అనుభవించిన వారే. అందుకనే ఏ దంపతులైనా "సీతా రాములల్లె కలకాలం అన్యోనంగా పది కాలాలు వర్ధిల్లమని" ఆశీర్వాదం ఇవ్వడం మనమందరమ్ చూస్తూనే ఉంటాం. ఈ ఆశీర్వాదం ఎప్పుడూ "శివ పార్వతులల్లె" లేక "రుక్మిణి కృష్ణులల్లే"  అని ఎప్పటికి ఉండదు. అయితే ఎందుకని వీరి దాంపత్య వైభవం ఇంత ప్రత్యేకత ఎందుకని సమకూరిందో తెలిసికొనే ప్రయత్నం చేద్దాం. 

వారి దాంపత్యాన్ని గురించి ప్రస్తావించే ముందర, అస్సలు ఎవరి గురించయ్యా మనం మాట్లాడ బోయేది?

శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రేమేయం 
సీతా పతిం రఘుకులాన్వయ రత్న దీపం 
అజానుభాహుం అరవింద దళాయ తాక్షం 
రామం నిశాచర వినాశకరం నమామి 

రాముడంటే ఎటువంటి వాడు?

రామో విగ్రహవాన్ ధర్మః !! రామో దుర్నాభి బాషితే !! 
రామః కమల పత్రక్షా సర్వ సత్వ మనోహారః 
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే 
తెజశా దిత్య సంకాశః క్షమయః పృధివీ సమః 
బృహస్పతి సమో భుధ్యా యశసా వాశావో పమః 

రామ చంద్రుడు ధర్మానికి పూర్తి ప్రతిరూపం. రాముని మాటకు రెండు భావాలూ ఉండవు. రాముని నమ స్మరణతోనే ఈ ప్రకృతి అంతా పులకరిస్తుంది అట. కోటి సూర్యులకు తుల్యమైన తేజస్సు తో బాటు పృథ్వి కి సమానమైన వినయ సంపన్నుడు, బుద్ధి లో బృహస్పతి, ధైర్యశాలి ఆ రామ చంద్రుడట. శ్రీ మహావిష్ణువుని రామావతారంలో రెండు ప్రయోజనాలు. ఒకటి రావణాసురుని అంతం ఇంకొకటి మానవాళి కి ధర్మాచరణ వైశిష్టత గురించి ఇచ్చిన ప్రత్యక్ష నిదర్శనం. ఇది కృష్ణ, నరసింహ వంటి ఇతర అవతారాలకు  పూర్తి విరుద్ధం. 

మరి సీతమ్మ తల్లో !!

ఇయం సా ధర్మ శీలస్యా  మైదిలస్య మహాత్మనా 
సుతా జనక రాజస్యా భ ర్త్రు దృడ వ్రతా 

సకల ధర్మాత్ముడైన జనక మహారాజు నాగలి పట్టి దున్నుతుండగా భూమి నిండి ఉద్భవించిన మహా సాధ్వి. జనకుడు ఈ అయోనిజను మామూలు వ్యక్తులకు ఇచ్చి తన తండ్రి బాధ్యతను అంత సులభంగా నిర్వర్చించాలని అనుకోలేదు. అనితర సాధ్యమైన మహా శివుని విల్లు చేపట్టే ధీరుని కి మాత్రమే సీతాదేవి ని పరిణయమాడ గలిగిన అర్హుడని నిర్ణయించాడు. 

హనుమ సీతాదేవి చూసిన సిద్ది సర్గలో ఈ విధంగా భావించి సంతుష్టుడు అవుతాడు. 

రాజ్యం వా త్రిషు లోకేషు సీతవా జనకాత్మజా 
త్రై లోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్  కలామ్ 

ఒక వేళ శ్రీ రామునకు కనుక సీత మరియు ముల్లోక రాజ్యాధికారం లలో ఒకటి మాత్రమే ఎన్నుకోవాలంటే, ఒక్క ముహూర్త సమయం కూడా ఆలోచించ కుండా సీతాదేవిని కోరుకొంటాడు. రాముని మనస్సు లో ఏముందో సీత ఎల్లా వేళలా తెలుస్తుంది, అదే విధం గా సీతా దేవి ఏమి కోరుకుంటుందో శ్రీ రామునికి సదా విదితమే !! వారిద్దరిది బాధ్యతాయుత మైన దాంపత్యం. పరస్పరం ఇరువురు కర్తవ్యమ్ గుర్తు చేసికొంటూనే ఉంటారు. మీ తండ్రి దశరధుడు నిన్ను పద్నాలుగు సంవత్సరాలు అరణ్య వాశం చెయ్య మంటే, ఈ అస్త్రాలు శస్త్రాలు వెంట పెట్టు కొని ఎందుకు వచ్చావయ్యా? రాక్షసులతో ప్రత్యక్ష వైరం లేకపోగా వాళ్ళ అందరిని సంహరిస్తానంటివే, అంటూనే సీతా దేవి రాముని దుష్ట శిక్షణ కై పరోక్షం గా దృడ సంకల్పుడిని చేస్తుంది. "సీతా !!  శరణా గతి చేసిన ఋషులను రక్షించడమే నా ప్రధాన ధ్యేయం. ఆ లక్ష్య సాధన లో నాకు ఎన్ని అడ్డంకులు ఎదురు అయినా నేను లెక్క చేయను" అని ప్రతిజ్ఞ చేయిస్తుంది. ఇదే విషయం ని లంక లో నిస్సహాయ స్థితి లో ఉన్నప్పుడు, రామునికి గుర్తు చేసే ప్రయత్నం కూడా చేస్తుంది . "రామా, మనశా వాచా కర్మణ, నిన్నే స్మరిస్తునాను అయ్యా !! మరి ఎందుకని వచ్చి నన్ను రక్షించవు ? నీవు శరణా గతులని రక్షిస్తావంటివే, మరి ఎందుకని నన్ను ఈ లంక లో నిండి, ఈ రాక్షసుల బారి నిండి కాపాడి తీసి కెళ్లవు ? నా వ్రతం లో గాని లేక తపస్సు లో గాని ఏమైనా లోపం ఉన్నదా" అంటూ హనుమ తో శ్రీ రాముడు కి సందేశం పంపిస్తుంది !!

వారిరువురు క్షణ కాలమైనా వియోగం భరించలేరు. అంతటి శ్రీరాముడు కూడా దుష్ట రాక్షస ప్రమేయంతో సీతాపహరణం జరిగిన వేళ నిస్సహాయుడు అవుతాడు. 

ఉపవాశ కృ శాం దీనాం నిశ్స్వ సంతీం  పునః పునః 
దదర్శ శుక్ల పక్షా ధౌ చంద్ర రేఖాం మివానలామ్ 

అపహరింపబడిన సీతాదేవి, శోకసముద్రురాలై అశోక వనంలో సదా పతి  చింతనతో అనుక్షణం గడుపుతూ ఉంటుంది. అదే విధంగా శ్రీ రామచంద్రుడు కూడా సర్వము కోల్పోయినవాడల్లే నిశ్శక్తుడై గడుపుతూ ఉంటాడు. ఇదేవిషయం హనుమ అశోకవనంలో ప్రస్థావిస్తాడు. 

నిత్యం ధ్యాన పరో రామో నిత్యం శోక పరాయణ 
నాన్యచింత యతే కించిత్ సతు కామవశమ్ గతః 

అమ్మా!! శ్రీ రామచంద్రుడు సకలావశ్తలందు నీ ధ్యాశ లోనే మునిగి, నిన్ను చేరుకొనడం అన్న ఆలోచన తప్ప వేరే ఏమీ కోరిక లేని వాడై ఉన్నాడమ్మా.. అంటూ హనుమ వివరిస్తాడు . అదే విధం గా సీతమ్మ తల్లి కూడా, 

దీనోవా రాజ్య హీనోవా వామో మే భర్త సమే గురు 
తమ్ నిత్య మనురక్తాస్మి యధా సూర్యం సువర్చలా 

రాక్షస రాజు రావణుడు సీతాదేవి ని ఐహిక లాభాలతో ప్రలోభపెడితే, ఆ అమ్మ, "నా రాముడు దీనుడైనా, రాజ్య హీనుడు అయినా, అతడే నాకు గురువు. నేను సదా నా పతికి  అనురక్తురాలును" అని అంటుంది.

ఇదే భావం అరణ్య కాండలో మరొక సందర్బం లో కూడా వెల్లడిస్తుంది. 14 సంవత్సరాల అరణ్య వాసం తండ్రి ఆజ్ఞ శిరసావహించడానికి ఉద్యుక్తుడు అవుతూ, "సీతా !! ఈ శాసనం నాకు మాత్రమే వర్తిస్తుంది. నీవు నా వెంట వచ్చి అరణ్యవాస కష్టాలు అనుభవించవల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు" అని అనగా ఆ దేవి, "భర్త వెంట లేకపోవడమే తనకి అత్యంత దుర్భరమైన కఠిన శిక్ష" అని పేర్కొంటుంది. 

సీతా రాముల కళ్యాణం కమనీయం !! వారి దాంపత్యం ఆదర్శప్రాయం  !! ఇప్పటికి, ఎప్పటికి రామాయణ వైభవమే మనకి సదా పూజ్యనీయం !! రామాయణ వైభవం తలిచి, కొలిచి ఎందరో మహానుభావులు తరించారు. అన్నింటి కన్నా ముక్ష్యంగా రామ నామ పారాయణంనకు  మంగళ ప్రదుడైన హనుమ మన వెంటే ఉంటాడు. 

యత్రః యత్రః  రఘునాదః కీర్తనం 
తత్రః తత్రః క్రుతమస్తః కాంజలీమ్ 

రామ నామం మానవ జీవితాల్లో ఎంతగా ఇమిడీ కృతం అయ్యిందంటే,  మన పేర్ల్లల్లో  రామ నామం చేరుస్తాం, మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా రాముడినే తలుస్తాం, మన సంప్రదాయం ప్రకారం వివాహ శుభ పత్రికల్లో కూడా ఆ నాటి సీత రామ తలంబ్రాలే ఆ కొత్త జంటకి ఆశీర్వాదం కావాలన్నా తలంపు తోనే

జానక్యః కమలాంజలి పుటేయః పద్మరాగాయితః 
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితః 
స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్ర నీలయితః 
ముక్తస్తా శుభదా భవంతు భవతాం శ్రీ రామ వైవాహికః 

అన్న శ్లోకం ముద్రిస్తాం . ఈ అవకాశం ఇచ్చిన అందరికి నా ధన్య వాదాలు తెలుపుతూ, ఆ రామానుగ్రహం  మన అందరి పైనా సదా ఉండాలి అని కోరూతూ "సర్వే జనః సుఖినో భవంతు", "జై శ్రీ రామ్"